డీసీ ప్రమోటర్లకు షాకిచ్చిన ఈడీ : ముగ్గురి అరెస్ట్
వెంకట్రామిరెడ్డి అప్పుల చిట్టా 2005 నుంచి మొదలైంది. 2009-2011 సంవత్సరాల మధ్య వందల కోట్ల రూపాయల్ని వేర్వేరు బ్యాంకుల..
డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ ఊహించని షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో విచారణకు సహకరించకపోవడంతో డెక్కన్ క్రానికల్ ఎండీ వెంకట్రామ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురినీ నేడు కోర్టులో హాజరుపరచనుంది. రూ.8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో డీసీపై ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లో డెక్కన్ క్రానికల్ కు చెందిన రూ.363 కోట్ల విలువైన 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. డీసీ స్కామ్ పై ఆరు ఎఫ్ఐఆర్ లను కూడా నమోదు చేసింది.
వెంకట్రామిరెడ్డి అప్పుల చిట్టా 2005 నుంచి మొదలైంది. 2009-2011 సంవత్సరాల మధ్య వందల కోట్ల రూపాయల్ని వేర్వేరు బ్యాంకుల నుంచి ఆయన సంస్థ డీసీహెచ్ఎల్ అప్పుగా తీసుకుంది. వెంకట్రామిరెడ్డి తమను మోసం చేశారంటూ 2013లో కెనరా బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. వేర్వేరు బ్యాంకుల్లో ఒకే ఆస్తిని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. కెనరా బ్యాంక్ ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేసింది.
ఈ కేసులోనే ఈడీ ఎంటరైంది. గతంలో రూ.3300 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ.. వెంకట్రామిరెడ్డి భారీగా రుణాలు తీసుకుని వాటిని దారిమళ్లించినట్లు అభియోగాలు చేసింది. మొదట విచారణకు సహకరించినా.. తర్వాత విచారణకు సహకరించలేదు వెంకట్రామిరెడ్డి అండ్ కో. దాంతో ఆయనతో పాటు పీకే అయ్యర్, ఆడిటర్ మనీ ఓమెన్ లను అరెస్ట్ చేసింది.