డిగ్గీరాజాకే అధ్యక్ష పదవి?
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఎవరూ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు రావడం లేదు
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఎవరూ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. అశోక్ గెహ్లాత్ ను అధ్యక్ష పదవికి అనుకున్నా ఆయన అందుకు సుముఖంగా లేరు. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఆయన సిద్ధపడకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం గెహ్లాత్ పై సీరియస్ గా ఉంది. కష్ట సమయంలో పదవులను వదులుకోవాల్సిన గెహ్లాత్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతుండటాన్ని అనేక మంది తప్పు పడుతున్నారు. అశోక్ గెహ్లాత్ ఈరోజు కాంగ్రెస్ సోనియా గాంధీని కలవనున్నారు.
సోనియాతో భేటీ తర్వాత....
దీంతో దిగ్విజయ్ సింగ్ పేరును అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దిగ్విజయ్ సింగ్ హైకమాండ్ కు నమ్మకమైన నేతగా ఉన్నారు. ఆయనను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. డిగ్గీరాజా ఈరోజు రాత్రికి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయన రేపు నామినేషన్ వేసే అవకాశముందని చెబుతున్నారు. మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ పేర్లను కాంగ్రెస్ అధినాయకత్వం అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే శశిధరూర్ మాత్రం తాను ఎన్నికల బరిలో ఉంటానని చెబుతున్నారు. చివరకు అధ్యక్ష పదవి దిగ్విజయ్ సింగ్ కు దక్కే అవకాశాలు మాత్రం ఉన్నాయి.