పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. అందుకే అంటారా?

కేంద్ర ప్రభుత్వం ఐదు రోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది

Update: 2023-09-01 02:03 GMT

కేంద్ర ప్రభుత్వం ఐదు రోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు జరుగుతాయ­ని తెలిపారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్‌లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. పార్లమెంట్‌ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్‌ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. అందుకే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్‌–డిసెంబర్‌ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఈ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఓ స్పెషల్ బిల్లును ప్రవేశపెట్టనుందంటూ ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు చర్చలు నడుస్తున్నాయి. ఒక దేశం.. ఒక ఎన్నికల అనే బిల్లును ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్‌లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.


Tags:    

Similar News