ఇస్రో చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం సక్సెస్

Update: 2022-10-23 02:03 GMT

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శనివారం 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాల కూటమిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. LVM3-M2/OneWeb India-1 మిషన్ 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో ధృవీకరించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. ఆన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం3-ఎం2/ఆన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ (జీఎల్ఎల్‌వీ ఎంకే-3)కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. జీఎస్ఎల్‌వీ ఎల్‌వీఎం 3 పేలోడ్ సామర్థ్యం 10 టన్నులు కాగా, ఆరు టన్నుల బరువుతోనే నింగిలోకి దూసుకెళ్లింది. ఎల్‌వీఎం-3 ద్వారా చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం ఇదే. ఈ మిషన్ కోసం ఆన్‌వెబ్-న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శాటిలైట్లను రాకెట్ జియోసింక్రనస్ కక్ష్యలో కాకుండా భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. దీంతో ఈ లాంచ్ వెహికల్ పేరును జీఎల్ఎల్‌వీ నుంచి ఎల్‌వీఎంగా మార్చారు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.

వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ, "ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కారణంగా లాంచ్‌లు ఆలస్యమయ్యాయి. ఈ ప్రయోగానికి భారతదేశం చాలా మద్దతు ఇచ్చింది. ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రయోగాలను నిర్వహిస్తున్నాం" అని అన్నారు. వన్‌వెబ్ ఈ ప్రయోగం కోసం రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023 జనవరిలో వన్‌వెబ్ పేలోడ్‌ను మోసుకెళ్లే మరో GSLV ప్రయోగం జరగనుంది.


Tags:    

Similar News