కాంగ్రెస్ కు కపిల్ సిబల్ రాజీనామా.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్
స్వతంత్ర అభ్యర్థిగా రాజ్య సభకు వెళ్లాలని అనుకుంటున్నాను. దయచేసి సహకారం అందించండి..
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆ పార్టీకి ఊహించని షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో సిబల్ వెంట సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో పాటు పార్టీ నేతలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా కపిల్ సిబల్ మాట్లాడుతూ.. "స్వతంత్ర అభ్యర్థిగా రాజ్య సభకు వెళ్లాలని అనుకుంటున్నాను. దయచేసి సహకారం అందించండి అంటూ అఖిలేశ్ జీని కోరాను. 30 ఏళ్ల తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను. విపక్షాల్లో చాలా వాటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తో అనుబంధం ఉందని నా భార్య చెప్పింది" అని సిబల్ తెలిపారు.
అనంతరం అఖిలేశ్ మాట్లాడుతూ.. "నేడు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు వెళుతున్నారు. మరో ఇద్దరు కూడా ఎస్పీ నుంచి రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది. ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటులో చాలా చక్కగా వినిపిస్తారు. ఆయన సొంత అభిప్రాయాలతో పాటు, ఎస్పీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తారని భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.