కేరళ కుంభకోణం : శివశంకర్ అరెస్ట్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం. శివశంకర్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు

Update: 2023-02-15 07:57 GMT

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం. శివశంకర్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై శివశంకర్ ను ఈడీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ కేసులో అరెస్టయిన మొదటి వ్యక్తి శివశంకర్. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ ద్వారా రెడ్ క్రెసెంట్ మంజూరు చేసిన 18.50 కోట్లతో కేరళ ప్రభుత్వం లైఫ్‌ మిషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కోట్లు చేతులు మారాయని...
ఈ ప్రాజెక్టు కింద త్రిసూర్ జిల్లాలోని వడక్కంచేరిలో 140 ఇళ్లను నిర్మించాలని భావించింది. అయితే ఈ ప్రాజెక్టును 14.50 కోట్ల రూపాయలతోనే నిర్మించింది. మిగిలిన మొత్తాన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్ర నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించింది. 4.50 కోట్ల వ్యయంతో ఆరోగ్య సంరక్షణ కేంద్రం నిర్మించేందుకు యూనిటాక్ బిల్డర్స్ కు కాంట్రాక్టుకు ఇచ్చింది. ఈ కాంట్రాక్టులో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో స్వప్న సురేష్, శివశకంర్ పాత్ర ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొలుత శివశంకర్ ను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News