kumbhamela : నేటి నుంచి ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా.. పోటెత్తిన భక్తులు
ప్రపంచంలోనే అత్యంత అది పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమయింది.;
ప్రపంచంలోనే అత్యంత అది పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమయింది. యమున, సరస్వతి, గంగ నదుల సంగమ ప్రదేశమైన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సోమవారం నాడు పుష్య పూర్ణమి కావడంతో ఈరోజు తెల్లవారు జాము నుంచే లక్షల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు.
35 కోట్ల మంది వస్తారని...
ఈ కుంభమేళా మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరగనుంది. కేవలం దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘాట్ ల వద్ద గజఈతగాళ్లను సిద్ధం చేసింది. భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 35 కోట్ల మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మంచినీటితో పాటు వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది.
ప్రత్యేక ఏర్పాట్లు...
రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ఈ మహా కుంభమేళాకు నడుపుతుంది. ఇక్కడే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం పది వేల ఎకరాల్లో కుంభ మేళా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తెలిపారు. రోజుకు యాభై లక్షల మంది నుంచి కోటి మంది వరకూ ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. యాభై ఐదు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చిన్న పడవల్లో పహరా కాస్తున్నారు. భక్తులకు అసౌకర్యానికి లోనుకాకుండా యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.