Train Accident : భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కారణాలేంటి?
మైసూర్ - దర్బంగా భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కుట్ర కోణం దాగి ఉందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు
మైసూర్ - దర్బంగా భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కుట్ర కోణం దాగి ఉందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. తమిళనాడులోని కవరైపేట రైల్వేస్టేషన్ లో శుక్రవారం జరిగిన రెండు రైళ్లు ఢీకొట్టడంతో దాదాపు పదహారు బోగీలు బోల్తా కొట్టాయి. ఏసీ బోగీలు తగలబడ్డాయి. అయితే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తొలుత అధికారులు భావించారు. అయితే దీని వెనక కుట్ర కోణం దాగి ఉందని భావించిన రైల్వే శాఖ ఉన్నత స్థాయి అధికారులు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించింది.
వెనక ఎవరైనా ఉన్నారా?
భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి ఉగ్రకోణంలోనే చూస్తున్నారు. ఒడిశాలో బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం మాదిరిగానే భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగి ఉంటుందని రైలు అధికారులు భావిస్తున్నారు. భాగామతి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చివరి క్షణంలో తేరుకుని డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో కొంత నష్టాన్ని నివారించగలిగారు. కానీ అప్పటికే జరగాల్సిన నష‌్టం జరిగిపోయింది. రెండు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నా ప్రయాణికులు గాయాలతోనే బయటపడగలిగారు. దాదాపు పందొమ్మిది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
ఎన్ఐఏకి దర్యాప్తు బాధ్యత...
ప్రస్తుతం ట్రాక్ పనులను రైల్వే శాఖ అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అనేక రైళ్లను రద్దు చేశారు. తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ రైల్వే ప్రమాదంపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. రైల్వేశాఖ ఎంప్లాయీస్ తప్పిదమా? కుట్రకోణమా? అన్న అనుమానంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా రైల్వే శాఖ విచారణ చేపట్టింది. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపాలున్నాయా? అన్న దానిపై పరిశీలన జరిపింది. అయినా కుట్రకోణం ఉందని అనుమానం ఉండటంతో జాతీయ దర్యాప్తునకు ఈ రైలు ప్రమాదం ఘటన విచారణకు అప్పగించింది. ఎన్‌ఐఏ దర్యాప్తులో అసలు నిజాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. దేశంలో వరస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.