Parliament : సంక్షేమం - అభివృద్ధి సమానంగా పరుగులు తీస్తుంది
భారతీయ సంస్కృతి, సభ్యత ఎంతో ఉన్నతమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు
భారతీయ సంస్కృతి, సభ్యత ఎంతో ఉన్నతమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కొత్త పార్లమెంటులో తన తొలి ప్రసంగమిది అని అన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి వందకు పైగా పతకాలు సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. పార్లమెంటు ఉభయ సభనలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ అని ఆమె ప్రశంసించారు. దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తుందన్నారు. జీ20 సమావేశాలు విజయవంతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.
లక్షల సంఖ్యల ప్రభుత్వ ఉద్యోగాలు...
రీఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌కు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణలో సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఈ ప్రభుత్వం లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందన్నారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనను చేపట్టామని ఆమె తెలిపారు. ఆదిత్య ఎల్ 1 మిషన్ ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిందని అన్నారు. భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి కక్షలోకి ప్రవేశించిందన్నారు. నారీ శక్తి వందన్ అభినందనీయమన్న రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించుకున్నామని తెలిపారు. దేశంలో కొత్తగా క్రిమినల్ చట్టాన్ని తీసుకు వచ్చామని చెప్పారు.
పేదరిక నిర్మూలనే...
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా భారత్ ముందుకు వెళుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చామని తెలిపారు. భారత్ లో తొలిసారిగా నమో భారత్ రైలును ప్రవేశపెట్టామని తెలిపారు. అయోధ్యలో అన్ని రకాల ఆటంకాలను అధిగమించి రామాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారమయిందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ట్ పేరుతో ముందుకు వెళుతున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందరం కలసి వికసిత భారతాన్ని నిర్మించుకుందామని పిలుపు నిచ్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని రాష్ట్రపతి అన్నారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తివేత చారిత్రాత్మక ఘట్టమని ఆమె అభిప్రాయపడ్డారు. పేదల కోసం పది కోట్ల ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం ఇరవై లక్షల కోట్లను ఖర్చు చేశామని చెప్పారు.
డిజిటల్ రంగంలో...
డిజిటల్ రంగంలో భారత్ దూసుకెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డిజిటల్ పేమెంట్స్ లో భారత్ చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూస్తుందన్నారు. ముంబయిలో అటల్ సేతు నిర్మించుకున్నామన్న ద్రౌపది ముర్ము నేడు 1.4 కోట్ల మంది జీఎస్‌టీ కడుతున్నారని తెలిపారు. దేశంలో 1300 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించామని చెప్పారు. దేశంలో 20 నగరాల్లో మెట్రో ట్రెయిన్ వ్యవస్థ ఉందని వివరించారు. దేశ వ్యాప్తంగా 39 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. 11 కోట్ల ఇళ్లకు పైపులైన్ ద్వారా మంచినీరు దేశంలో అందుతుందన్నారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించామని చెప్పారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్ అనేక విజయాలను సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఏడు లక్షల రూపాయల వరకూ ఆదాయపు పన్ను లేకుండా చేశామని చెప్పారు. గత పదేళ్లలో ఐదు శాతం కంటే ద్రవ్యోల్బణం తక్కువగానే ఉందని చెప్పారు.