మోదీ భావోద్వేగం
పార్లమెంటు భవనంతో తన అనుబంధాన్ని మోదీ నెమరు వేసుకున్నారు. ఆయన ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు
చారిత్రాత్మక పార్లమెంటు భవనానికి నేడు వీడ్కోలు పలుకుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ పార్లమెంటు భవనం మనల్ని ఎన్పడూ ఉత్తేజపరుస్తుంటుందని ఆయన తెలిపారు. తొలి రోజు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషి కారణంగానే జీ 20 సదస్సు విజయవంతమయిందని ప్రధాని అభిప్రరాయపడ్డారు. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వ కారణమని ఆయన తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం మన శాస్త్రవేత్తల సామర్ధ్యానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రతి భారతీయుడు గర్వదించదగిన అంశమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు భవనంతో తన అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. ఆయన ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
దేశ సామర్థ్యంపై...
భారత్ సామర్థ్యంపై చాలా మందికి సందేహాలుండేవని, కానీ వాటిని పటాపంచలు చేస్తూ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని ఆయన పేర్కొన్నారు. భారతీయుల స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్ ను కూడా జీ 20లో కలుపుకున్నామని ఆయన చెప్పారు. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది అని మోదీ అభిప్రాయపడ్డారు. మరింత అభివృద్ధి దిశగా భారత్ పయనిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఎన్నో కీలక నిర్ణయాల దిశగా 75 ఏళ్ల ప్రస్థానం సాగిందన్నారు.
భారత్ మిత్ర దేశంగా...
ఇతర దేశాలు సయితం భారత్ వైపు చూస్తున్నాయని మోదీ తెలిపారు. భారత్ నిర్మాణాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలన్న మోదీ వందేళ్ల చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయని తెలిపారు. కొత్త భవనంలోకి వెళ్లిన తర్వాత కూడా పాత భవనాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, అది ప్రేరణగా నిలుస్తుందన్నారు. పాత భవనాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచే ఉంచుతామని చెప్పారు. ప్రపంచదేశాలకు భారత్ మిత్రదేశంగా మారిందన్నారు. ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంటు సూచిక అని ఆయన అన్నారు.
అభివృద్ధి దిశగా...
అనేక రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించందన్న మోదీ ప్రతి దేశం భారత్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తుందన్నారు. దేశంలో మహిళలకు సముచితమైన గౌరవం లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారతీయ విలువలు, ప్రమాణాలతో ఇది సాధ్యమయిందని ఆయన చెప్పారు. అదే దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. అందరం కుటుంబంలా వ్యవహరిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. భారత్ ఇప్పుడు విశ్వమిత్రగా మారిందన్నారు. తాను పార్లమెంటుకు తొలిసారి వచ్చినప్పుడు అభివందనం చేశానని, ఒక పేదవాడు పార్లమెంటులోకి అడుగుపెట్టగలడా? అన్న సందేహాలను పటాపంచలయ్యాయని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తాను తొలి రోజు ఒకింత భావోద్వేగానికి గురయ్యాయని తెలిపారు.
మహిళల సంఖ్య...
కరోనా క్లిష్ట సమయంలోనూ భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. భారత పార్లమెంటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వస్తుందన్న మోదీ సభల్లో మొదట్లో తక్కువగా ఉన్న మహిళల సంఖ్య క్రమంగా పెరిగిందన్నారు. పార్లమెంటులోకి వెళితే గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు. ఇంద్రజిత్ గుప్తా ఈ భవనంలో 4౩ ఏళ్ల పాటు సేవలందించారని గుర్తుకు తెచ్చుకున్నారు. దళితులు, ఆదివాసీలకు ఈ సభ అవకాశం కల్పించిందన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారత్ ప్రతిష్ట పెరుగుతూనే ఉందని మోదీ అన్నారు. పాత భవనానికి వీడ్కోలు పలకడం భారంగా అనిపిస్తున్నా తప్పదని అన్నారు. రైల్వే ప్లాట్‌ఫాం నుంచి వచ్చిన వ్యక్తి ఈ దేశంలో అత్యున్నత స్థానాన్ని పొందారని ఆయన ఎమోషనల్ అయ్యారు.