నేడు ముఖ్యమంత్రులతో మోదీ భేటీ
ప్రధాని మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానం ద్వారా భేటీ అయ్యే మోడీ కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే భారత్ లో థర్డ్ వేవ్ మొదలయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కీలక నిర్ణయాలు.....
భారత్ లో రోజుకు దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కరోనా, ఒమిక్రాన్ తో అల్లాడి పోతున్నాయి. ఇటు లాక్ డౌన్ విధించలేక, అటు పరిస్థితిని వదిలివేయలేక ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ తో పాటు కఠిన ఆంక్షలకు దిగాయి. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా పరిస్థితులతో పాటు, వైద్య సౌకర్యాలు, ఆర్థిక పరిస్థితిపై మోదీ చర్చించే అవకాశముంది.