Bengaluru Water Crisis: నీళ్లు లేవు బాబోయ్.. ఖాళీ అవుతున్న ఐటీ కార్యాలయాలు.. ఇంటి బాట పట్టిన ఉద్యోగులు

బెంగళూరు నగరంలో తాగునీటి సమస్యకు ఇంకా తెరపడలేదు. నీటి ఎద్దడి ఇంకా కొనసాగుతూనే ఉంది

Update: 2024-03-20 03:38 GMT

Bengaluru Water Crisis:బెంగళూరు నగరంలో తాగునీటి సమస్యకు ఇంకా తెరపడలేదు. నీటి ఎద్దడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాగడానికి, స్నానాలకు కూడా నీళ్లు దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. నీటి ట్యాంకర్ల వద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. ప్రజలందరూ ట్యాంకర్ వచ్చిందని తెలిస్తే చాలు వచ్చి వాలిపోయి బిందె నీటి కోసం కొట్లాటలకు దిగుతున్నారు. ట్యాంకర్ వెంట అనేక మంది ద్విచక్ర వాహనాలపై వెంటపడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటితో నిండిన ట్యాంకర్ వెళుతుందంటే దాని వెంట ఎంత దూరమయినా ప్రయాణించి బకెట్ నీళ్లను తెచ్చుకునేందుకు ప్రజలు అనేక ప్రయాసలు పడుతున్నారు.

మూడు దశాబ్దాలుగా...
మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని నీటి ఎద్దటి బెంగళూరు నగరంలో నెలకొంది. డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనుకున్నా అపార్ట్‌మెంట్ వాసులకు ట్యాంకర్లు దొరకడం లేదు. దైనందిన కార్యక్రమాలకు కూడా నీరు దొరకడం కష్టంగా మారింది. భూగర్భ జలాలు ఇంకిపోవడం, నీటి సరఫరా తగ్గిపోవడంతో జనం అల్లాడి పోతున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా ట్యాంకర్ దొరకడం లేదు. ఒక అపార్ట్‌మెంట్ కు వారానికి ఒక ట్యాంకర్ ను మాత్రమే పంపుతామని బెంగళూరు మహా నగర పాలక సంస్థ షరతు విధించింది. తాగునీటిపై కూడా రేషన్ విధించింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పాఠశాలలను మూసివేశారు. వ్యాపార సంస్థలు కూడా కొన్ని సమయాల్లోనే తెరుస్తున్నారు. హోటల్స్‌లోనూ నీటి బాటిల్ ధరను పెంచేశారు. ఎండలు మండిపోతున్న సమయంలో చిరు వ్యాపారుల పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటికే సొంత ప్రాంతాలకు...
ఇక బెంగళూరులో ఐటీ ఉద్యోగులు తమ సొంత ఇళ్లకు తరలిపోతామంటూ కార్యాలయాలకు మెయిల్స్ పంపుతున్నారు. తమకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించాలని వారు సంస్థలను కోరుతున్నారు. ఇప్పటికే అనేక మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లి వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్నారని తెలిసింది. బెంగళూరు ప్రాంతంలో ఉండే ఐటీ ఉద్యోగులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్ల వద్ద నీటి కోసం కొట్లాటకు దిగలేక, నీళ్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఎంత డబ్బు పెట్టినా నీరు దొరకకపోవడంతో బెంగళూరు మహానగరంలో ఐటీ ఉద్యోగులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు.
బంధువుల ఇంటికి వెళ్లి...
కొందరు ఉద్యోగులు తమ స్వస్థలం బెంగళూరు అయినప్పటికీ పొరుగున మైసూరు, హోసూరు ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువుల ఇంటికి వెళుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. మామూలు ఉద్యోగులు మాత్రం తాము ఎటూ వెళ్లలేక నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పట్లో బెంగళూరు నీటి సమస్యకు తెరపడే అవకాశం కనిపించడం లేదు. భారీ వర్షాలు కురిస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి మహానగరం బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా....నీరు దొరకకపోవడంతో వ్యాపారులు కూడా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఒక్క నీటి చుక్క బెంగళూరు ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీసిందన్న అంచనాలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News