నేటి నుండి రోహిణి కార్తె..ఉష్ణోగ్రతలు ?
ఇక రోహిణి కార్తె రానే వచ్చింది. "రోళ్లు బద్దలు కొట్టే రోహిణీకార్తె" సామెత ఊరికే రాలేదు మరి. ఎండాకాలంలో..
మూడురోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ రాత్రి వర్షం పడితే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ నమోదవుతూనే ఉన్నాయి. విపరీతమైన ఎండలు, ఉక్కపోతకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉగాది నుండి రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వచ్చాయి. గతవారం తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి.
ఇక రోహిణి కార్తె రానే వచ్చింది. "రోళ్లు బద్దలు కొట్టే రోహిణీకార్తె" సామెత ఊరికే రాలేదు మరి. ఎండాకాలంలో చివరిగా వచ్చే కార్తె. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలకు ఉక్కిరి బిక్కిరవుతుంటే.. రోహిణి కార్తెలో వచ్చే ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే 25న ప్రారంభమయ్యే రోహిణి కార్తె జూన్ 8 వరకు ఉంటుంది. ఈ పక్షం రోజుల్లో ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు (వడగాలులు) పెరుగుతాయి. ఉక్కపోతలతో మరింత ఉక్కిరి బిక్కిరి అవుతారు. రోహిణి కార్తెలో ఎండలను, వడగాలులను తట్టుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
శరీరం అలసిపోకుండా ఉండేందుకు తరచూ మట్టికుండలో నీరు త్రాగడం, మజ్జిగ, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ వంటివి తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో నీటికి, కూల్ డ్రింక్ లకు పిల్లల్ని దూరంగా ఉంచడం వారి ఆరోగ్యానికి మంచిది. తినే ఆహారంలో ఎక్కువగా నీటిశాతం ఉండే కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పచ్చళ్లు, వేపుళ్లు, అధికంగా ఆయిల్ తో చేసిన వంటకాలను తినకపోవడం మేలు. ఎండలో వెళ్లాల్సిన అవసరం ఉంటే.. లేత రంగుల్లో ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.