నేటి నుంచి రూ.2000 నోట్ల మార్పు.. డిపాజిట్ కు ఈ షరతు వర్తిస్తుంది
ప్రజలు తమవద్దనున్న నోట్లను మే 23 నుండి ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా బ్యాంకుల్లో మార్చుకుని..
మే19న ఆర్బీఐ రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు తమవద్దనున్న నోట్లను మే 23 నుండి ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా బ్యాంకుల్లో మార్చుకుని అందుకు తగిన చిల్లర మొత్తానికి తీసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎలాంటి ఫారమ్ లు నింపనక్కర్లేదు. అలాగే ఎలాంటి రుసుము కూడా చెల్లించనక్కర్లేదు. కానీ.. ఒక వినియోగదారుడు ఒకరోజుకి రూ.20000 అంటే 10 రూ.2000 నోట్లను మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుంది.
రూ.2000 నోట్లు మార్చుకోని వారు తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ కు ఇప్పటివరకూ బ్యాంకుల్లో ఉన్న నియమ, నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్ తెలిపారు. రూ.50,000 దాటిన డిపాజిట్ కు పాన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. అధికమొత్తంలో డిపాజిట్లు చేస్తే.. వాటి గురించి ఇన్ కం ట్యాక్స్ వాళ్లు చూసుకుంటారన్నారు. కాగా.. రూ.2000 నోట్ల రద్దు ప్రకటనతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇదే అదనుగా వ్యాపారస్తులు కూడా ఉన్నధర కంటే.. కాస్త అధిక ధరకే బంగారం అమ్మకాలు జరుపుకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారు.