Petrol Prices : గుడ్ న్యూస్... త్వరలో తగ్గనున్న పెట్రోలు ధరలు... ఎంతంటే?

త్వరలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు తగ్గించనుందని తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో నిర్ణయం వెలువడే అవకాశముంది

Update: 2024-10-25 07:26 GMT

త్వరలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు తగ్గించనుందా? పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేరకు తగ్గించే యోచనలో ఉందా? అంటే అవుననే అనిపిస్తుంది. లీటరుపై ఐదు రూపాయల వరకూ పెట్రోలు ధరలు తగ్గే అవకాశమున్నాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేంద్ర మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా దీనిపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందే ఈ పెట్రో ఉత్పత్తి ధరలు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. జమిలి ఎన్నికల సమయానికి పెట్రోలు ధరలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర ఎన్నికల సమయంలో...
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గడం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. పెట్రోలు ధరలు తగ్గే అవకాశముందని ఇప్పటికే కేంద్ర పెట్రోల్ సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెట్రోలియం అండ్ సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. పెట్రోలు ధరలు తగ్గితే నిజంగా శుభపరిణామంగానే చూడాలి. ఎందుకంటే దానితో అనేక వస్తువుల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. సామాన్యులపై ఆర్థిక భారం తగ్గుతుంది.
క్రూడాయిల్ ధరలు...
మొన్నటి వరకూ అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు ఒక బ్యారెల్ చమురు ధర ఎనభై డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ధర 70 72 డాలర్ల గా ఉంది. ఇదే కొనసాగితే దేశంలో పెట్రోలు ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించే అవకాశాలున్నాయి. ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ అవసరం కూడా. అతిపెద్దదైన మహారాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ నిర్ణయం కమలం పార్టీకి అనుకూలంగా మారే అవకాశముంది. అందుకోసమైనా ధరలు తగ్గుతాయని, అందుకే మంత్రి, కార్యదర్శి ఈ హింట్ ఇచ్చారంటున్నాయి హస్తిన వర్గాలు. మరో వైపు అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం కూడా ఇందుకు కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనా భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కొంతమేరకైనా తగ్గితే అది చాలా ఉపశమనం కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.


Tags:    

Similar News