3 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లిన కుక్క.. ఏమి చేసిందంటే
ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఒక వీధికుక్క
హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఒక వీధికుక్క నవజాత శిశువును ఎత్తుకెళ్ళి చంపేసింది. ఎవరూ గమనించకుండా ఉన్న సమయంలో ఆ కుక్క పాపను ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చింది. సోమవారం-మంగళవారం మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
రెండు రోజుల పసికందు ఆస్పత్రిలో అమ్మమ్మ పక్కనే నిద్రిస్తోంది. కుక్క ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించడాన్ని ఎవరూ గమనించలేదు."కుక్క ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్నప్పుడు శిశువును నోటితో పట్టుకుని బయటకు తీసుకువెళ్లింది" అని సెక్టార్ 13-17 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విజయ్ కుమార్ తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ కనిపించకపోవడంతో పాప కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వీధికుక్క పసికందును బయటకు తీసుకెళ్లిందని కుటుంబీకులకు తెలిసింది. వెంటనే శిశువును తీసుకుని రాగా.. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలో కుక్క నోటి నుంచి పసికందును బయటకు తీయడం కనిపించింది. పాప తల్లి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రసవం కోసం పానిపట్‌కు వచ్చింది.
మే నెలలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ యూనిట్‌లో నాలుగు రోజుల పసికందు చేతులు, కాళ్లను ఎలుకలు కొరికాయి. అనంతరం ఆసుపత్రి అధికారులు విచారణకు ఆదేశించి ఏఎన్‌ఎం నర్సు, ఇద్దరు జీఎన్‌ఎంలు, క్లీనర్‌ను సస్పెండ్ చేశారు.