ఐటీ సోదాలపై ఉద్యోగులకు లేఖలు పంపిన బీబీసీ..
తాజాగా పంపిన లేఖల్లో.. కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి సహకరించాలని సూచించింది.
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం మొదలైన సోదాలు.. తెల్లవారేంతవరకూ జరిగినట్లు సమాచారం. ఇప్పటికీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ పంపిన బీబీసీ.. తాజాగా మరో లేఖను పంపింది. సంస్థ బ్రాడ్ కాస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారు మాత్రమే ఆఫీసుకు రావాలని, మిగతా వారు ఇంటివద్ద నుంచే పనిచేయాలని బీబీసీ మెయిల్ లో తెలిపింది.
తాజాగా పంపిన లేఖల్లో.. కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి సహకరించాలని సూచించింది. ఉద్యోగులు తమ జీతాలకు సంబంధించిన వివరాలు అడిగితే ఎలాంటి సందేహం లేకుండా చెప్పాలని తెలిపింది. అయితే.. వ్యక్తిగత ఆదాయ వివరాలను చెప్పాల్సిన అవసరం లేదని బీబీసీ తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది. సదరు సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడిందన్న అనుమానంతోనే సర్వే చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు. పన్నుల విషయంలో సందేహాలు ఉండటంతో.. వాటి నివృత్తికై బీబీసీ అకౌంట్స్ బుక్స్, బ్యాలెన్స్ షీట్ తదితరాలను తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.