నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. మాజీ ప్రధానితో భేటీ
లంచ్ సమయంలో దేవెగౌడతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. సుమారు రెండున్నర గంటలపాటు..
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరుకు బయల్దేరారు. ఉదయం 11 గంటలకు హాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.15 గంటలకు లీలా ప్యాలెస్ హోటల్ కి చేరుకుంటారు. 11.45 గంటలకు హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి బయల్దేరి, 12.30 గంటలకు చేరుకుంటారు.
లంచ్ సమయంలో దేవెగౌడతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. సుమారు రెండున్నర గంటలపాటు సీఎం కేసీఆర్ దేవెగౌడతో సమావేశమవుతారని తెలుస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం ముగిసిన అనంతరం.. సాయంత్రం 3.45 గంటలకు దేవెగౌడ నివాసం నుంచి హాల్ ఎయిర్ పోర్టుకు బయల్దేరుతారు. 4 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి.. సాయంత్రం 5.10 గంటలకు తిరిగి ప్రగతి భవన్ కు చేరుకుంటారు.
కాగా.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న రోజే.. సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నందుకే కేసీఆర్ ప్రధానిగా దూరంగా ఉంటున్నారన్న వార్తలొస్తున్నాయి.