చైనాలో విజృంభిస్తున్న...
చైనాలో ఇప్పటికే అనేక మంది హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. హాంకాంగ్, మలేషియా వంటి దేశాల్లోనూ ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. కానీ భారత్ లో ఇప్పటి వరకూ ఈ కేసులు నమోదు కాకపోవడంతో భారత్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే తొలిసారి బెంగళూరులో రెండు కేసులు నమోదు కావడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాల వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తిరిగి పరీక్షలు నిర్వహించాలని, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని ఐసొలేషన్ కుతరలించాలన్న ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.
శీతాకాలంలో సహజమేనని...
అయితే శీతాకాలంలో ఇలాంటి వ్యాధులు సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ, తిరిగి మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, షేక్ హ్యాండ్ వంటి వాటికి దూరంగా ఉండటం, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలని కోరుతున్నారు. అయితే బెంగళూరు నగరంలో హై అలెర్ట్ ను ప్రభుత్వం ప్రకటించిందన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు సిటీలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతుంది. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశముండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయిందని తెలిసింది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీచేసింది.
సరిహద్దు రాష్ట్రాల్లో...
ముఖ్యంగా వృద్దులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే సమయంలో సరిహద్దు చెక్ పోస్టుల్లో కూడా తనిఖీ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. వైరస్ మరింత విస్తరించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, లేకుంటే గతంలో కరోనా వైరస్ తరహాలో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందన్న హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప బెంగళూరు నగరానికి వెళ్లకపోతే మంచిదన్న సూచనలు అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరుకు బస్సుల్లో, రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా రద్దు చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద బెంగళూరు నగరంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావడంతో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావాల్సి ఉందని చెబుతున్నారు.