భూమా ఫ్యామిలీని వదులుకోరా?.... అదిరే ట్విస్ట్‌..!

Update: 2018-07-14 15:30 GMT

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర మార్పులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ఆశావ‌హులు వేగంగా పావులు క‌దుపుతున్నారు. త‌మ‌తో పాటు త‌మ కుటుంబ స‌భ్య‌ల్లో ఒక‌రిని బ‌రిలోకి దింపేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఈ టికెట్ ఇవ్వాల‌ని అడ‌గ‌లేదు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకురాలేదు. అక్క‌డి నుంచి డిమాండ్లు ఏమీ లేక‌పోయినా.. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు టికెట్లు ఆ ఫ్యామిలీకి దాదాపు ఖ‌రారు చేసింది టీడీపీ అధినాయ‌క‌త్వం. ఈ విష‌యం తెలిసిన వారంతా అగ్గిమీద గుగ్గిలంలా మండి ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం 'రాజ‌కీయాల్లో కొన్ని అలా క‌లిసొస్తుంటాయి' అని స‌రిపెట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూలులోనే కాదు.. టీడీపీలోనే భూమా ఫ్యామిలీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కుటుంబానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు సీట్లు దాదాపు ఖరారైనట్లేన‌ని తేలిపోయింది.

ఒకే ఫ్యామిలీ ఒకే టిక్కెట్.....

ఒక కుటుంబం నుంచి ఒక‌రికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మ‌రొక టికెట్ ఆశించొద్ద‌ని త‌న‌ను క‌ల‌సిన ఆశావ‌హుల‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పష్టంచేస్తున్నారు. కానీ కొన్ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఒక‌టి కంటే ఎక్కువ సీట్లు కేటాయించాల్సి వ‌స్తుంది. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు క‌ర్నూలులోనూ వ‌చ్చింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డితో పాటు ఆమె కూతురు అఖిల‌ప్రియ.. టీడీపీలో చేరిన త‌ర్వాత అనేక ఆస‌క్తిక‌ర ప‌రిణామాలే జ‌రిగాయి. మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారనే చ‌ర్చ అప్ప‌ట్లో జోరుగా జ‌రిగింది. పార్టీలో చేరిన కొన్ని రోజుల‌కే నాగిరెడ్డి మ‌ర‌ణించ‌డం.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అదే కుటుంబానికి చెందిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వ‌డం జ‌రిగిపోయింది. అన్న‌ను గెలిపించుకునేందుకు అఖిల‌ప్రియ ఎంతో శ్ర‌మించారు.

సానుభూతి ఉందని....

ఇక త‌ర్వాత జ‌రిగిన కేబినెట్ విస్త‌ర‌ణ‌లో అఖిల‌ప్రియ‌ను తీసుకుని.. ఆయా వ‌ర్గాల‌ను శాంత‌ప‌రిచారు చంద్ర‌బాబు! తండ్రికి ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు ఉన్నా.. చంద్ర‌బాబు ఆమెపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకునేందుకు సుముఖంగా లేరని తేలిపోయింది. ఒక‌వేళ తీసుకుంటే నంద్యాల‌తో పాటు ఆళ్ల‌గ‌డ్డ‌లో పార్టీకి వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌ని తేలిపోయింది. అదే టైంలో అఖిల వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్‌.విజ‌య‌ల‌క్ష్మితో మాట్లాడార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బాబు ఇక్క‌డ ఎలాంటి డ్యామేజ్ జ‌ర‌గ‌నీయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యారు. దీంతో ఆమెను మంత్రిగా కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఇక కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న స‌మ‌యంలో మ‌ళ్లీ టికెట్ల హ‌డావుడి మొద‌లైంది. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ద్వారా తేలిందేంటంటే.. ఆ ఫ్యామిలీకి మూడు టికెట్లు ఇస్తార‌ట‌. ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా అఖిల‌ప్రియ‌ను మార్చే ప్ర‌స‌క్తే లేదు. ఒక‌వేళ మార్చితే సానుభూతి పోయి.. అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప‌రిస్థితి. అటు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న త‌ల్లిదండ్రులు ఇద్ద‌రిని కోల్పోయిన అఖిల‌కు టిక్కెట్ ఇస్తేనే పార్టీకి జిల్లాలో దాదాపు నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల్లో సానుభూతి ప‌నిచేసే ఛాన్సులే ఉన్నాయి. ఈ మైలేజ్ చంద్ర‌బాబు వ‌దులు కోవ‌డానికి సిద్ధంగా లేరు.

నంద్యాల కూడా......

రెండోది నంద్యాల‌. ఈసారి కూడా ఈ టికెట్టు బ్ర‌హ్మానంద‌రెడ్డికే ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే హామీ ఇచ్చార‌ట‌. ఇక్క‌డ కూడా ఆళ్ల‌గ‌డ్డ ప‌రిస్థితే ఉంది క‌నుక పార్టీ నుంచి వ్య‌తిరేక‌త ఎదురైనా బ్ర‌హ్మానంద‌రెడ్డికే టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క్రియేట్ అయిపోయింది. బాబు హామీతోనే బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉప ఎన్నిక‌ల టైంలో ఇక్క‌డ భారీగా రిలీజ్ చేసిన నిధుల‌తో అభివృద్ధి ప‌నులు కంప్లీట్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో బాగా తిరుగుతూ పార్టీలో ప‌ట్టు సాధించారు. ఇక్క‌డ శిల్పా ఫ్యామిలీని జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో ఢీ కొట్ట‌డం అంటే మాట‌లు కాద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డుతున్నారు.

కర్నూలు చెప్పేశారు.....

ఇప్పుడు తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌నతో అఖిల మేన‌మామ ఎస్వీ మోహ‌న్‌రెడ్డి క‌ర్నూలు నుంచి బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఇటీవ‌ల క‌ర్నూలులో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న లోకేష్.. క‌ర్నూలు అభ్యర్థి ఎస్వీ మోహ‌న్‌రెడ్డి అంటూ చేసిన వ్యాఖ్య పార్టీలో దుమారం రేపిన విష‌యం తెలిసిందే! దీనిపై ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా ఈ మూడు టికెట్లు భూమా ఫ్యామిలీకి క‌న్ఫామ్ అని తేలిపోయిందని పార్టీ సీనియ‌ర్లు స్ప‌ష్టంచేస్తున్నారు.

Similar News