వచ్చేస్తాం...గ్రీన్ సిగ్నల్ ఇస్తారా...??

Update: 2018-12-31 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనవరిలో అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తానని చెప్పేశారు. దీంతో కొందరు పార్లమెంటు సభ్యులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీకి ఈసారి వెళ్లమని, లోకల్ గానే ఉంటామని బాబుకు విన్నపాలు చేసుకుంటున్నారు. హస్తిన లో ఉన్నా తగిన గౌరవం, గుర్తింపు లేకపోవడంతోనే ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సుముఖత చూపడం లేదు. ఇప్పటికే అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉండి సాధించేదేమీ లేకపోగా, ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనం అధికంగా ఉండటమే ఎంపీల నిర్వేదానికి కారణంగా చెబుతున్నారు.

ఇక్కడ గెలిస్తే.....

పార్లమెంటు సభ్యుడిగా ఉండటం కంటే ఇక్కడే అసెంబ్లీలో గెలిచి అదృష్టం ఉంటే మంత్రి పదవి దక్కుతుందన్నది మరి కొందరి ఆలోచనగా ఉంది. అందుకే ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులకు ఈసారి అసెంబ్లీ ఎన్నికలపైనే గాలి మళ్లింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్దకు ఎంపీలు క్యూకడుతున్నారట. గత కొన్ని దఫాలుగా పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేస్తున్న నేతలు ఈసారి తమకు రిలీఫ్ ఇవ్వాలని అధినేత వద్ద మొరపెట్టుకుంటున్నారు. స్థానిక రాజకీయాల్లో తమకు అవకాశాలు కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు.

ఒక్కరేమిటి...వరుసబెట్టి....

విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు నుంచి మొదలుపెడితే హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప వరకూ అదే రూటులో ఉన్నారు. అశోక్ గజపతి రాజు ఇప్పటికే చంద్రబాబు వద్ద తన మనసులో మాట చెప్పేశారు. ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు. ఆయన ఒక్క 2004లోనే విజయనగరం అసెంబ్లీ నుంచి ఓడిపోయారు. మిగిలిన అన్ని సార్లూ గెలుస్తూ వస్తున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తాను అసెంబ్లీకి వచ్చేస్తానని, భీమిలీ ఇవ్వాలని ఆయన గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం జగ్గంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని గట్టిగా చెబుతున్నారు.

అక్కడ ఉన్నా ఏం ప్రయోజనం...?

మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ సయితం పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇప్పటికే కొనకళ్ల రెండు సార్లు ఎంపీగా పనిచేయడంతో విసుగు చెంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి పోటీ చేసే అవకాశం లేదు. ఆయన తన అల్లుుడ శ్రీధర్ రెడ్డి కోసం అసెంబ్లీ సీటును అడుగుతున్నారు. ఇక కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సయితం ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప అసెంబ్లీకి పోటీ చేయాలని బాబుపై వత్తిడి తెస్తున్నారు. పుట్టపర్తి స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే బాబుకు కిష్టప్ప అప్లికేషన్ పెట్టుకున్నారన్న ప్రచారం బాగాఉంది. ఇక గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి ఓటమి పాలయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు సయితం ఎమ్మెల్యే టిక్కెట్లే కోరుతుండటం విశేషం. ఈసారి మళ్లీ మోదీ సర్కార్ వస్తే అక్కడ ఉండి ఏమీ చేయలేమన్న నిస్పృహతోనే వీరు అసెంబ్లీ బాట పట్టారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మరి వీరిలో ఎందరికి చంద్రబాబు అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తారన్నది తేలాల్సి ఉంది.

Similar News