మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

Update: 2018-05-19 13:34 GMT

డి.కె.శివ కుమార్, కర్ణాటక రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. 27 ఏళ్ల ప్రాయంలోనే ఎమ్మెల్యేగా గెలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆయన సత్తా తెలిసిన అప్పటి ముఖ్యమంత్రి మంత్రిని కూడా చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తాను ఏదైనా అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లే రకం. కాంగ్రెస్ అంటే ప్రాణం. తాను ఎదిగిందీ, తనను తొక్కేసిందీ కాంగ్రెస్ లోనే. అన్ని అర్హతలు ఉన్నా ఆశించిన పదవులు ఇవ్వలేదు ఆ పార్టీ. కానీ, ఏనాడు పార్టీ గిసిన గీత జవదాట లేదు. గతంలో విలాస్ రావు దేశ్ ముఖ్ ను, ఇటీవల అహ్మద్ పటేల్ ను, తాజాగా కుమారస్వామిని రాజకీయ ప్రతీకూలతల నుంచి కాపాడి పదవులు అందుకోవడంలో ఆపన్నహస్తం అందించాడాయన. కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు మరోసారి చర్చనీయాంశమైంది. అసలు ఎవరీ శివ కుమార్ ఆయన రాజకీయ జీవితం ఏంటీ, కాంగ్రెస్ లో ప్రత్యేకత ఎలా తెచ్చుకున్నాడో చూద్దాం...

మొదటి నుంచీ ఇంతే...

57 ఏళ్ల శివకుమార్ కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వార్తల్లో ఉండే వ్యక్తి. ఒక్కళిగ సామాజికవర్గానికి చెందిన ఆయన 1989లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే సతానూర్ నుంచి ఎమ్మెల్యేగా విధానసభలో అడుగుపెట్టారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప శివకుమార్ సత్తాను గుర్తించి జైళ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 29 మాత్రమే. చిన్న వయస్సులోనే మంచి రాజకీయ అవకాశాలు దక్కించుకున్న ఆయన ప్రతికూల పరస్థితులూ, రాజకీయ వేధింపులు కూడా ఎదుర్కొన్నారు. ఎస్.ఎం.కృష్ణ హయాంలోనూ మంత్రిగా పనిచేసిన శివకుమార్ 2002లో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో దేవెగౌడపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా 2004లో మళ్లీ అదే సీటులో ఓ జర్నలిస్టును నిలబెట్టి దేవెగౌడపై గెలిపించి ప్రతీకార విజయం సాధించారు. ఇలా ఆయనకు సహజంగానే మొదటి నుంచి దేవె గౌడ కుటుంబంతో రాజకీయ వైరం ఏర్పడింది.

క్యాంపుల వ్యూహాల్లో దిట్ట...

డీ.కే.శివ కుమార్ కు ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహించడం కొత్త కాదు. ఇలా పలు కీలక సందర్భాల్లో తన వ్యూహాలతో ఎమ్మెల్యేలను పార్టీ చేజారకుండా చూసుకుని అధిష్ఠానానికి నమ్మకమైన వ్యక్తిగా నిలిచారు. 2002లో మహారాష్ట్రలో అప్పటి ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం పడిపోయే దిశలో ఎమ్మెల్యేలను క్యాంపు కోసం కర్ణాటకకు పంపారు. వీరి బాధ్యతను ఎస్.ఎం.కృష్ణ శివకుమార్ పైన పెట్టారు. ఇదే ఈగల్టన్ రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను జాగ్రత్తగా ఉంచి ప్రభుత్వం నిలబడేలా చేశారు. ఇక గత సంవత్సరం జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ను ఓడించేందుకు బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. అప్పుడు కూడా గుజరాత్ ఎమ్మెల్యేలను అదే ఈగల్టర్ రిసార్ట్స్ లో దాచి అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడయ్యేలా చూశారు. ఈ సమయంలో ఆయనపై ఇన్ కం ట్యాక్స్, ఈడీ దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదు. ఇక తాజాగా కూడా అధిష్ఠానం ఆదేశాల మేరకు దేవెగౌడ కుటుంబానితో ఉన్న రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి మరీ ఈగల్టన్ లో ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించడం, హైదరాబాద్ కు తరలించడంలో, శిబిరంలో లేని ఎమ్మెల్యేలు అనంద్ సింగ్, ప్రతాప్ గౌడలను మళ్లీ తీసుకురావడంలో ఆయన చూపిన చొరవే కారణమని చెప్పక తప్పదు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావడం శివకుమార్ లక్ష్యం. అధిష్ఠానానికి పలు సందర్భాల్లో తన సత్తా చూపిన శివకుమార్ కు సముద్రం వంటి హస్తం పార్టీలో ఆ అవకాశం దొరుకుతుందో లేదో చూడాలి మరి.

Similar News