గుంటూరు లోక్‌సభ సీటు కోసం ఈ సారి ఆసక్తికరమైన సమరం జరగబోతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ బరిలోకి దిగారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబంతో పాటు అటు తల్లి గల్లా అరుణకుమారి నుంచి వచ్చిన బలమైన రాజకీయ వారసత్వం తోడవ్వడం, ఇటు గుంటూరు జిల్లాలో బలంగా వీచిన టీడీపీ పవనాలు, అటు వల్లభనేని బాలశౌరి వైసీపీ నుంచి జయదేవ్‌కు సరైన ప్రత్యర్థి కాకపోవడంతో జయదేవ్ పెద్దగా కష్టపడకుండానే గెలిచారు. నాలుగేళ్లలో ఆయన గుంటూరు నగరానికి విజిటింగ్ ఎంపీగానే వ్యవహరించారన్న అపవాదు మూటకట్టుకున్నారు.
ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో.....
ఎంపీ అన్నాక స్థానికంగా క్యాంప్ కార్యాలయం ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి... ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వారికి టైం కేటాయించాలి. కానీ జయదేవ్ మాత్రం అయితే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్, చిత్తూరు టైం ఉంటే గుంటూరు ఎప్పుడు వస్తారో ? ఎప్పుడు వెళతారో ? కూడా తెలియని పరిస్థితి. నాలుగేళ్లలో గుంటూరు నగరానికి జయదేవ్ స్పెషల్‌గా తన ఎంపీ కోటాలో చేసిన అభివృద్ధి చెప్పుకునేందుకు ఏమీ లేదు.
2019లో హోరాహోరీయే...
ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తిరిగి గుంటూరు నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతోన్న జయదేవ్ ఇప్పటికే నియోజకవర్గంలో తన పనితీరు ఎలా ఉంది ? మళ్లీ తనకు ఓట్లేస్తారా ? గెలుపు ఓటముల అంశంపై సొంతంగా సర్వే చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో జయదేవ్‌కు కాస్త పాజిటివ్‌గా వచ్చినా గెలుపు అంత సులువు అయితే కాదని తేలినట్టు తెలిసింది.
ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.....
వచ్చే ఎన్నికల్లో జయదేవ్‌కు వైసీపీ నుంచి అన్నివిధాలా గట్టి ప్రత్యర్థి పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత ఎంతోకొంత కనిపిస్తోంది. మరోవైపు జనసేన కాపులకు సీటు ఇస్తే కాపు ఓటు బ్యాంకు బలంగా చీలనుంది. ఇక వైసీపీ నుంచి ఎంపీగా పోటీకి దిగుతోన్న విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా ఆర్థిక, సామజిక కోణంలోనూ బలంగా ఉండడమే కాక జయదేవ్‌కు సరితూగే ఉన్నత విద్యావంతుడు కావడంతో పోటీ టఫ్‌గానే కనిపిస్తోంది.
అసెంబ్లీ సెగ్మెంట్లలో తీవ్ర వ్యతిరేకత...
జయదేవ్ నియోజకవర్గానికి చేసిందేమి లేకపోయినా, స్థానికంగా అందుబాటులో లేకపోయినా ఇతరత్రా ఆరోపణలు మాత్రం లేవు. అయితే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలపై మాత్రం వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. గుంటూరు వెస్ట్‌లో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గ్రూపు రాజకీయాలతో పార్టీని నాశనం చేశాడని సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేస్తున్నారు. ఇక తెనాలిలో ఆలపాటి రాజ కబ్జాలు, ఇతరత్రా ఆరోపణలతో ఆయనకు వ్యతిరేకత ఎక్కువే ఉంది. ఎమ్మెల్యేల పరంగా చూస్తే నియోజకవర్గ పరిధిలోని ఏ ఎమ్మెల్యేతోనూ జయదేవ్‌కు సరైన సత్సంబంధాలు లేవు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా, మోదుగుల, తెనాలి శ్రవణ్‌కుమార్‌తో పాటు నరేంద్రతోనూ అంతంతమాత్రంగానే జయదేవ్‌కు సఖ్యత వాతావరణం ఉంది.
ప్రత్యర్థులు బలంగా....
ప్రత్తిపాడులో మాజీ మంత్రి రావెల తీరుతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. తాడికొండలోనూ ఎంపీ, ఎమ్మెల్యే గ్రూపులు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా స్ట్రాంగ్‌గా ఉండడంతో ఇక్కడ వైసీపీకే స్వల్ప ఎడ్జ్ ఉంది. ఇక పొన్నూరులో నరేంద్రకు మొగ్గు ఉన్నా అక్కడ ఆయన వ్యక్తిగత ఇమేజ్ వేరుగాను, ఎంపీకి వచ్చేసరికి ఓటింగ్ వేరుగానే ఉండొచ్చు. ఇక్కడ మెజార్టీ వచ్చినా జయదేవ్‌కు మరి అంత ఎక్కువ అయితే ఉండదు. మంగళగిరిలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే బలంగానే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు 12 ఓట్ల మెజార్టీయే వచ్చింది. ఈ సారి ఇక్కడ రాజధాని ఏరియా అవ్వడం టీడీపీకి ప్లస్ అయితే, ఆర్కే బలంగా ఉండడం వైసీపీకి కలిసి రానుంది. గత ఎన్నికల్లో జయదేవ్‌కు బాలశౌరిపై గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది. ఈ సారి మాత్రం గెలుపు కోసం చాలా కష్టపడాల్సిందే.