వైసిపికి ఆయుధం అందించిన జెసి ...?

Update: 2018-07-19 02:25 GMT

కేంద్రంలోని బిజెపి సర్కార్ పై అవిశ్వాసం నోటిస్ ఇచ్చి విజయవంతమైంది టిడిపి. కానీ ఇప్పుడు పసుపు పార్టీకి కొత్త తలపోటు ఎదురైంది. అనంతపురం లోక్ సభ సభ్యుడు జె సి దివాకర రెడ్డి విప్ జారీ చేసినా పార్లమెంట్ గుమ్మం తొక్కను పొమ్మన్నారు. ప్రభుత్వం పడిపోనప్పుడు ఏపీకి న్యాయం జరగనప్పుడు ఎందుకీ వృధా ప్రయాస అన్నది జెసి ఆర్గ్యుమెంట్. దాంతో టిడిపి కి ఈ ఎపిసోడ్ తో వచ్ఛే మైలేజ్ కి జెసి దెబ్బ కొట్టినట్లు అయ్యింది, దాంతో బాటు టిడిపి, బిజెపిలు కలిసే కొత్త డ్రామాకు పార్లమెంట్ వేదికగా తెరతీశాయన్న వైసిపి ఆరోపణలు బాగా ప్రచారంలోకి పోయే ప్రమాదం దాపురించింది.

ఆది నుంచి అంతేగా ...

జెసి దివాకర రెడ్డి ఏమి చేసినా, ఏ వ్యాఖ్యలు చేసినా వెరైటీ గానే ఉంటుంది. ఊరంతా ఒకదారైతే జెసి దారి మాత్రం సపరేట్. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టిడిపి కి చాలా క్లిష్టమైన యుద్ధం కేంద్రం తో నడుపుతున్న సమయంలో సొంత పార్టీ ఎంపి వైఖరి మింగుడుపడని పరిస్థితి గా మారింది. దాంతో జెసిని పార్టీ పెద్దలు బుజ్జగించి ఢిల్లీ కి పంపిస్తారా ? లేక స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి ఆయన్ను బతిమాలి లోక్ సభకు పంపిస్తారా ? లేదా ఆయన్ను పట్టించుకోకుండా వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. ఒక పక్క అవిశ్వాసం పై ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి పూర్తి బలం వున్నా తమ సత్తా కూడా చాటి చెప్పాలని తహ తహ లాడుతున్న టిడిపి దేశవ్యాప్తంగా బిజెపియేతర పార్టీల మద్దత్తు అభ్యర్థిస్తుంది. అలాంటి తరుణంలో ప్రతి సభ్యుడి మద్దతు అత్యవసరం. ఈ పరిస్థితి లో మీ పార్టీ ఎంపీలే హాజరు కానంటున్నారుగా అని ఇతర పార్టీలు కానీ, ప్రజలు కానీ ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పుకోవాలి అన్నది పసుపు దండుకు ఇబ్బందే.

వైసిపికి అడ్వాంటేజ్ ...

కీలక తరుణంలో టిడిపి ఎంపీ జెసి దివాకర రెడ్డి పార్లమెంట్ కి డుమ్మా కొట్టడం ఇప్పుడు వైసిపికి అడ్వాంటేజ్ గా మారనుంది. రాజీనామాలు చేసి పార్లమెంట్ లో మోడీ సర్కార్ కి సహకరిస్తున్నారన్న టిడిపి ఆరోపణలను వైసిపి, జెసిని సాకుగా చూపి ఎదురుదాడి చేసే పరిస్థితి ఎదురుకానుంది. చర్చ లో పాల్గొనకుండా వైసిపి రాజీనామాలు చేసి బయటకు వచ్చేసిందన్న అపవాదు నుంచి ఇప్పుడు అనుకోకుండా టిడిపి ఎంపీనే కాపాడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మీ పార్టీ ఎంపీనే సభకు హాజరు కానని విప్ జారీచేసిన పోనని చెప్పాకా బిజెపితో అంతర్గత అవగాహన కాక మరేమిటి అనే విమర్శలు వైసిపి నుంచి ఎదురుకానున్నాయి . ఇలా అనేక కోణాల్లో అధికారపార్టీని ఇరుకున పెట్టె ఛాన్స్ జెసి ఎపిసోడ్ తో వైసిపి కి లభించింది. మరి దీన్ని ఎలా విపక్ష పార్టీ మలుచుకుంటుందో చూడాలి.

Similar News