ఎన్నికలు వస్తున్నాయంటే.,. పార్టీల్లో పండుగ వాతావరణం ఉండేది. అభ్యర్థుల కోలాహలం కూడా కనిపించేది. కానీ, మారిన రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో గడిచిన మూడు ఎన్నికల నుంచి ఎన్నికలు వస్తున్నాయంటే.. పార్టీలు, వాటి అదినేతలకు చలిజ్వరాలు పట్టుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఒక టికెట్ ఇద్దరు ముగ్గురు వరకు బరిలో నిలవడమే! అంతేకాదు, వారంతా గెలుపు గుర్రాలే కావడం! మరింత ముఖ్యంగా వీరిలో ఎవరికి టికెట్ ఇస్తే.. ఎవరు యాంటీ అవుతారో ? ఎవరు రెబల్‌గా మారతారో ? అనే ప్రమాదం ఇప్పుడు అన్ని పార్టీలనూ వేధిస్తోంది. ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ వాతావరణాన్నే తెరమీదికి తెస్తోంది విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం. ఇక్కడ టీడీపీకి లెక్కకు మించి నాయకులు ఉండడం, వారంతా టికెట్ ఆశిస్తుండడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
పీలాకు డౌటేనా....?
విషయంలోకి వెళ్తే.. టీడీపీ టికెట్‌ను ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆశిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పటి నుంచి అభివృద్ధి మంత్రం జపిస్తూ అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని తనకే టికెట్ ఇవ్వాలని ఆయన చెబుతున్నారు. ఇక, ఇదే టికెట్ కోసం డాక్డర్ సత్యవతి పోటీ పడుతున్నారు. ఆమెకు మహిళల్లో మంచి గుర్తింపు ఉండడం వల్ల ఆమె కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఆమెకు టికెట్ ఖరారయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో టీడీపీతో బీజేపీ పొత్తు కారణంగా సమీకరణాలు మారిపోయి సత్యవతికి టికెట్ చేజారిపోయింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతోంది.
తాము కష్టపడుతున్నామని.....
అదేవిధంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్వరరావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. పార్టీని తన భుజస్కంధాల పై వేసుకుని సహకార, సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేశానని, అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయనకు ఆర్థిక బలం అంతంత మాత్రమేనని, ఎన్నికల్లో ఖర్చు చేసేంత అవకాశం లేదనే కారణంగా ఈసారి కూడా ఆయనకు టికెట్ దక్కే ఛాన్స్ లేదు. ఇక, కోర్ కమిటీ సభ్యుడుగా పనిచేసిన ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు కూడా అదిష్ఠానం ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే, చంద్రబాబు ఈయనకు మొగ్గుతారనే ఆశలు అంతగా లేవు.
కొణతాల వస్తే.....
ఇవన్నీ ఒక ఎత్తయితే.. టీడీపీ కీలక నేతగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు పరుచూరి భాస్కరరావు కూడా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తొలుత అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ రాదని, వైసీపీకి వెళ్లిపోతారనే ప్రచారం జరగ్గా... తాజాగా ఇప్పుడు భీమిలి అసెంబ్లీ ఇప్పుడు వస్తుందని, ఈ మేరకు అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ గానీ ఇస్తారని ప్రచారం ఊపందుకుంది. మరి టీడీపీ పరిస్తితి ఇలా ఉంటే.. చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.