కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన పెట్టిన షరతులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కుమారస్వామి ముందుజాగ్రత్త పడ్డారు. తొలుత ముఖ్యమంత్రి పదవీకాలాన్ని సగం సగం పంచుకుందామనుకున్నారు. కాని కుమార స్వామి అందుకు ససేమిరా అంగీకరించలేదు. పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తెగేసి చెప్పారు. లేదంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోనని కూడా తేల్చి చెప్పారు.
తక్కువ స్థానాలొచ్చినా.....
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 78 స్థానాలు రాగా, జనతాదళ్ ఎస్ కు కేవలం 38 స్థానాలు మాత్రమే లభించాయి. అయితే బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ తొందరపడింది. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి తానే ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని కుమారస్వామి చక్కగా వినియోగించుకున్నారు. తాను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ మ్యానిఫేస్టోల రూపొందించిన అంశాలను కూడా అమలు పరుస్తానని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనకు తొలుత అయిష్టత వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేరే దారిలేక అంగీకరించిందని చెబుతున్నారు.
డిప్యూటీ స్పీకర్.....
కుమారస్వామి అలాగే మరోపని కూడా చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ తన ప్రమాణస్వీకారానికి రప్పించగలిగారు. ఆ యా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో జత కట్టని వారిని కూడా తన ప్రమాణ స్వీకారానికి పిలిపించుకుని తన వెనక వీరున్నారని కాంగ్రెస్ పెద్దలకు చెప్పకనే చెప్పినట్లయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఒక్క స్పీకర్ విషయంలో మాత్రం కుమారస్వామి అంగీకరించారు. స్పీకర్ పదవిని కాంగ్రెస్ కు, డిప్యూటీ స్పీకర్ పదవిని జేడీఎస్ కు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కాంగ్రెస్ నుంచి 22 మందికి, జేడీఎస్ నుంచి తనతో కలుపుకుని 12 మందికి మంత్రివర్గంలో చోటు ఉండేలా కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు జరిపారు.
ఉప ముఖ్యమంత్రి పదవి.....
కుమారస్వామి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ పార్టీ నేతలకు చెప్పి ఒప్పించింది. ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరిని తొలుత నియమించాలని భావించినా కేవలం దళిత నేత అయిన పీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ లోని లింగాయత్ వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని భావించారు. కాని దానికి కూడా కుమారస్వామి అంగీకరించలేదని తెలిసింది. మొత్తం మీద కాంగ్రెస్ బలహీనతను చూసి కుమారస్వామి తాను అనుకున్నవన్నీ సాధించారు.