ఆ ముగ్గురినీ ఎందుకు పట్టించుకోలేదు?

Update: 2018-05-29 07:30 GMT

ఈసారి మహానాడులో ఆ నలుగురు గురించే చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అయితే వారిలో నలుగురికి మంత్రి పదవులు దక్కాయి. మహానాడులో ఆ నలుగురిని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మంత్రులు అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులు మహానాడు ప్రాంగణంలో నామమాత్రమే అయ్యారు. వేరే పార్టీ నుంచి రావడంతో వీరిని కార్యకర్తలు సయితం పెద్దగా పట్టించుకోవడం లేదు.

తీర్మానాలు చేసేందుకు.....

మూడు రోజుల మహానాడు సభ సందర్భంగా దాదాపు 20కి పైగానే తీర్మానాలు చేశారు. అయితే ఈ నలుగురిలో ఎవరికీ తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం లభించలేదు. అంతేకాదు ప్రసంగించే అవకాశాలు కూడా రాలేదు. వేదికపై మంత్రి అమర్ నాధ్ రెడ్డి కొంత హడావిడి చేస్తూ కన్పించారు కాని మిగిలిన వారు నిశ్శబ్దంగానే ఉన్నారు. వాస్తవానికి ఈ నలుగురిలో ముగ్గురు మంత్రులకూ చంద్రబాబు వద్ద పెద్దగా మంచి మార్కులు లేవు. ముఖ్యంగా ఆదినారాయణరెడ్డి కడప జిల్లాలో వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతోనే అర్థమయింది. ఆదినారాయణరెడ్డిపై కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో మహానాడులో ఆదినారాయణరెడ్డి పెద్దగా కన్పించలేదు.

వారిపై లోకల్ అసంతృప్తే కారణమా?

ఇక సుజయ కృష్ణరంగారావు కూడా ఆయన జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి అఖిలప్రియ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య తారాస్థాయికి చేరిన వివాదాన్ని చంద్రబాబు రెండు రోజుల పాటు పంచాయతీ చేసి పరిష్కరించగలిగారు. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో ఈ ముగ్గురు మంత్రులకు మహానాడులో పెద్దగా ప్రాధాన్యత లభించలేదని తెలుస్తోంది. మహానాడుకు వీరు వచ్చినా ఏదో అలా వచ్చి వెళ్లామనే తప్ప కీలక పాత్ర పోషించలేదన్నది అర్థమవుతుంది.

Similar News