జగన్ జెండా ఎగరడం ఖాయం

Update: 2018-06-03 08:30 GMT

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని, జగన్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖామయని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. జగన్ పాదయాత్రకు వస్తున్న జనస్పందన చూస్తుంటే ముందే ఫలితాలు చెప్పేయవచ్చన్నారు. జగన్ పాదయాత్రతోనే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయిందన్నారు. ఈసారి జగన్ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు. మల్లాది విష్ణు ‘‘తెలుగు పోస్ట్’’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్ పాదయాత్రలో పడుతున్న కష్టాలను కూడా మల్లాది వివరించారు.

ప్రశ్న : జగన్ పాదయాత్ర ఎలా సాగుతుంది?

మల్లాది విష్ణు : ఊహించని విధంగా సాగుతుంది. ప్రజా స్పందన అనూహ్యంగా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ ను చూసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు తరలి వస్తున్నారు. జగన్ పాదయాత్రను దగ్గరుండి చూసిన వారికి ఎవరికైనా ప్రజల్లో ఇంత రెస్పాన్స్ ఎందుకు వస్తుందన్న అనుమానం కలగక మానదు. వాళ్లంతట వాళ్లే వచ్చి జగన్ ను కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జనం పోటెత్తుతుండటంతోనే ఆయన యాత్ర నిదానంగా సాగుతుంది.

ప్రశ్న: పాదయాత్రతో ఫలితం ఉంటుందంటారా?

మల్లాది విష్ణు : పాదయాత్రతో ఫలితం లేకపోవడమేంటి. మీరే చూస్తారు. జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసింది. అంతకు ముందు చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన తన అభవృద్ధి చూసే వస్తున్నారని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఇక జన్మభూమి కమిటీల ఆగడాలు రాష్ట్రంలో వేరే చెప్పక్కర్లేదు. తనకు తిరుగులేదనుకుంటున్న చంద్రబాబుకు జగన్ పాదయాత్రతోనే సమాధానమిచ్చారు. కృష్ణా జిల్లానే తీసుకోండి. ఎంత స్పందన? ఎవరూ ఊహించి ఉండరు. దీనికి కారణం జగన్ పై నమ్మకంతో పాటు చంద్రబాబుపై వ్యతిరేకత కూడా కారణమని చెప్పక తప్పదు.

ప్రశ్న : కాని పాదయాత్ర ప్రభావం లేదని...?

మల్లాది విష్ణు : పాదయాత్ర ప్రభావం ఏమీ లేదని తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా ప్రచారం చేసింది. కాని జనంలో ఉన్న జగన్ అవేమీ పట్టించుకోలేదు. ప్రజలు కూడా దగ్గరుండి చూస్తుండటంతో అది అవాస్తవమని తేలిపోయింది. పాదయాత్ర సక్సెస్ కాకుంటే ఇంతమంది పార్టీలోకి ఎందుకు వస్తారు? పాదయాత్రతో పార్టీకి హైప్ వచ్చింది కాబట్టే ఇప్పుడు వైసీపీలోకి చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ప్రతిరోజూ చేరికలు ఉంటున్నాయి. ఇంకా అనేక మంది నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది చాలు...పల్స్ ఏందో చెప్పడానికి.

ప్రశ్న : చేరికలతో గ్రూపు విభేదాలు తలెత్తవా?

మల్లాది విష్ణు : పార్టీలో చేరిన ప్రతి వారికీ టిక్కెట్ దక్కుతుందని చెప్పలేం. అలాగని పార్టీ కోసం కష్టించి పనిచేస్తే అధిష్టానం సరైన పదవులు ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. చేరే ప్రతి వాళ్లూ టిక్కెట్ కోసమే చేరుతున్నారనడం కరెక్ట్ కాదు. వైసీపీ వ్యూహం వైసీపీకి ఉంటుంది. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో? ఎవరు గెలుపు గుర్రాలో జగన్ నిర్ణయిస్తారు. అందరం కలసి విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవాలు. పార్టీలో చేరేటప్పుడు కూడా జగన్ నైతికతను ప్రదర్శిస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీలో చేరేటప్పుడు ఆయనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రమ్మన్నారు. చంద్రబాబు లాగా రాజీనామాలు చేయించుకుండా కండువా కప్పేయడం జగన్ చేయరు.

ప్రశ్న : ప్రత్యేక హోదాలో ఛాంపియన్ ఎవరు?

మల్లాది విష్ణు : ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాటం చేస్తున్నది జగన్ మాత్రమే. ఈవిషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హోదాకోసం ఆమరణ దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, యువభేరిలు నిర్వహించిన జగన్ ను చంద్రబాబు ఎద్దేవా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లు చంద్రబాబు తాకట్టు పెట్టారు.మోడీ, బాబు జోడీతో రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తామన్నారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టినా బాబు ఊర్కొన్నారు. ప్యాకేజీ కోసం పాకులాడారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయనికూడా చంద్రబాబు ప్రశ్నించారు. తర్వాత మోడీ హవా తగ్గిందని తెలుసుకుని బాబు యూటర్న్ తీసుకున్నారు. తొలి నుంచి ప్రత్యేక హోదా పై చంద్రబాబు పట్టుబట్టి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగివచ్చేది. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు బుద్ధిచెబుతారు.

ప్రశ్న: బీజేపీతో మీవి లాలూచీ రాజకీయాలంటున్నారుగా....?

మల్లాది విష్ణు : బీజేపీతో జత కట్టే ఖర్మ మాకు పట్టలేదు. గత ఎన్నికలకు ముందే బీజేపీ తమతో కలసి పనిచేసుందుకు ముందుకు వచ్చింది. అయితే మతతత్వ పార్టీ అని ఆరోజు బీజేపీతో పొత్తుకు మేం దిగలేదు. అది తప్పా? ఒప్పా? అన్నది పక్కన పెడితే గత ఎన్నికల్లోనే వైసీపీ స్టాండ్ ఏంటో ప్రజలకు తెలిసింది. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. మేం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాం. ఆ సత్తా మాకు ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఓట్ల శాతంలో తేడా కేవలం రెండు శాతం మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాకపోవడానికి మోడీ ఎంత కారణమో..? చంద్రబాబు అంతే బాధ్యత వహించాలి. అందుకే చంద్రబాబు చేసిన మోసాన్నిప్రజల్లో ఎండగడుతున్నాం. మోడీని విమర్శించడానికీ వెనుకాడం.

ప్రశ్న: చంద్రబాబు అన్ని హామీలు అమలు చేశామంటున్నారు మరి?

మల్లాది విష్ణు : ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్లి చూడండి. రైతు రుణమాఫీ జరగలేదు. డ్వాక్రా రుణాల మాఫీ కూడా మాయే. నిరుద్యోగ భృతి ఎన్నికలకు ముందర ఏదో ప్రకటించారు. అందులో కూడా అన్నీ షరతులే. చంద్రబాబు చెప్పిన వాటిలో ఏ ఒక్క వాగ్దానమూ అమలు కాలేదు. రాజధాని పేరుతో మరోసారి ప్రజలను వంచించేందుకు ముందుకు వస్తున్నారు. రాజధాని చంద్రబాబు ఒక్కరే కాదు. దేశంలోని అనేక రాష్ట్రాలు రాజధానులను నిర్మించుకున్నాయి. కేవలం రాజధానిని బూచిగా చూపి మళ్లీ అధికారంలోకి వద్దామనుకుంటున్నారు. కాని ప్రజలకు చంద్రబాబు నాలుగేళ్ల నాటకం అర్థమయింది. పైగా నవనిర్మాణ దీక్షల పేరిట ఏటా పదిహేను నుంచి ఇరవై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు.

ప్రశ్న : జగన్ పాదయాత్రలో ఇబ్బంది పడుతున్నట్లున్నారు...?

మల్లాది విష్ణు : దాదాపు తొమ్మిది నెలలు సాగే పాదయాత్రలో అనేక కష్టాలు వస్తాయి. మండు టెండలోనూ జగన్ మొక్కవోని దీక్షతో ముందుకు వెలుతున్నారు. ఎండవేడిమికి అస్వస్థతకు గురైనా పెద్దగా పట్టించుకోవడం లేదు. అరికాళ్లకు బొబ్బలు లేచినా పరవాలేదంటూనే నడుస్తున్నారు. ఒక్కోసారి వైద్యుల హెచ్చరికలను కూడా లెక్క చేయడం లేదు. జగన్ ను ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు. తొమ్మిది నెలల పాటు రోడ్లమీదనే ఉండాలంటే ఎవరికైనా కష్టమే. కాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే జగన్ అనుకున్నది సాధిస్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ జెండా ఎగరడం ఖాయం.

Similar News