కిరణ్ కిరాక్...డెసిషన్ ...?

Update: 2018-08-02 08:00 GMT

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన తరువాత తొలిసారి అమరావతిలో అడుగుపెట్టిన కిరణకుమార్ రెడ్డి యాక్షన్ లోకి దిగిపోయారు. జవసత్వాలు కోల్పోయి కదనరంగంలో చతికిలపడిన కాంగ్రెస్ కి పూర్వవైభవాన్నితెచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు చికిత్స మొదలు పెట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేశారు.

పార్టీని బూత్ స్థాయిలో ....

వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా ఏపీలో దక్కించుకోవాలంటే చేయాలిసిన పనులపై హస్తం పార్టీ పెద్దలు దృష్టి పెట్టారు. ముందుగా బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటూ రాబోయే మూడు నెలల్లో పని పూర్తి చేయాలని సంకల్పించారు. ఆ తరువాత కాంగ్రెస్ కి దూరమై ఏ పార్టీలో చేరని సీనియర్ నేతలను బుజ్జగించి తిరిగి వారిని సొంత గూటికి చేర్చాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రాంతీయ పార్టీల కు ఓట్లు వేయడం అనవసరమని దీనివల్ల జాతీయ స్థాయిలో పరిష్కారం కావలిసిన సమస్యలు అలాగే వుండి పోతాయన్న సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.

నేతల ఇళ్లకు వెళ్లయినా....

ప్రత్యేక హోదా, విభజన హామీలు, కాపుల రిజర్వేషన్ అంశాలను ప్రస్తావిస్తూ బలంగా జనంలోకి తీసుకువెళ్ళలని హస్తం నేతలు భావిస్తున్నారు. రాబోయే కీలక ఎన్నికల్లో పార్టీ జోష్ పెరగాలంటే ప్రస్తుతం వున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని శైలజానాధ్ వంటివారు సూచించారు. ఇతర పార్టీల నుంచి కూడా పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు కాంగ్రెస్ లో ఉండి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న వారిని వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ పార్టీలో క్రియాశీలం చేసి ముందుకెళ్లాలన్నది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా ఉంది. అందుకే ఆయన త్వరలో జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్వవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ జిల్లాలన్నింటినీ చుట్టి వచ్చారు. మొత్తానికి రాబోయే రోజుల్లో కిరణ్ మార్క్ పాలిటిక్స్ ను కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు చూడనున్నారు.

Similar News