షాకింగ్‌.. బాబుపై ఆ పార్టీ యూట‌ర్న్‌..!

Update: 2018-05-27 07:30 GMT

''రాష్ట్రంలో ఓ అస‌మ‌ర్ధుడు పాల‌న సాగిస్తున్నాడు. కేంద్రంతో మిత్రత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు.. ఏ ఒక్క అడుగూ.. ముందుకు వేయ‌లేదు. పైగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగ‌మ‌నంలో దూసుకు పోతోంది. బాబు వేస్ట్‌. ఓ వెన్నుపోటు ముఠా నాయ‌కుడు!'' - అని తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డ.. ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు.. ఒక్కసారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. బాబుపై ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. అంతేకాదు.. త‌మ‌కు కొత్త మిత్రులు దొరికారంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బ‌ట్టి.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? బాబు వ్యూహం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌సాధార‌ణంగా తెర‌మీదికి వ‌స్తున్నాయి.

కర్ణాటక ఫలితాల తర్వాత.......

ఇటీవ‌ల ముగిసిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో.. చంద్రబాబు అక్కడి బీజేపీకి ఓట్లు వేయొద్దంటూ.. పెద్ద ఎత్తున ప్రసంగాలు గుప్పించారు. మ‌రి వీటి ఫ‌లిత‌మో.. లేదా.. మ‌రే ఫ‌లిత‌మో తెలియ‌దు కానీ.. అక్కడ బీజేపీకి మేజిక్ ఫిగ‌ర్ వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. ఈప‌రిణామం త‌మ‌కు క‌లిసివ‌చ్చింద‌ని అప్పట్లోనే కాంగ్రెస్ ఏపీ నేత‌లు వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీ ప‌రిణామాల‌పై మాట్లాడిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ర‌ఘువీరా రెడ్డి.. మోడీని దులిపేశాడు కానీ, చంద్రబాబును ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. ‘ప్రధాని మోడీ నకిలీ. ఆయన మాటలు నకిలీ. బీజేపీ ప్రభుత్వమూ నకిలీనే. ఆయన కులం, చదువు కూడా నకిలీనే.

మోడీ ధ్వంసం చేశారంటూ......

ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించినప్పుడు ఆయన దార్శనికుడని, దేశోద్ధారకుడని చెప్పి బీజేపీ ప్రజలను మోసం చేసింది’ అని రఘువీరా ధ్వజమెత్తారు. ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తాను బీసీననే కారణంతోనే అవిశ్వాసం పెట్టారని ప్రకటించారని, ఆయన చేసిన పనులపై చర్చకు మాత్రం రాలేదని, అక్కడ కుల ప్రస్తావన ఎందుకని విరుచుకుపడ్డారు. ‘నాలుగేళ్ల తన పదవీ కాలంలో పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థలను మోడీ ధ్వంసం చేశారు. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారు. పార్లమెంట్‌ను, రిజర్వుబ్యాంక్‌ను నిర్వీర్యం చేశారు. నోట్లరద్దుతో నిస్సహాయ స్థితిలో పడి బ్యాంకింగ్‌ వ్యవస్థ నాశనమైంద’ని విమర్శించారు.

మోడీపై విరుచుకుపడి.....

"సీబీఐ, సుప్రీంకోర్టు వంటి వ్యవస్థలకు కూడా మోడీ ప్రభుత్వం చెడ్డపేరు తెస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ఇంతవరకు ముక్త్‌ కాంగ్రెస్‌ అని నినదించిన మోడీ నోరు ఇక పెగలదు. బీజేడీ, శివసేన, అకాలీదళ్‌ వంటి మిత్రులు ఆయనకు దూరమయ్యారు. కాంగ్రెస్ కు కొత్త మిత్రులు దగ్గరవుతున్నారు. మోడీ పాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు, ప్రజలపై ఉంది’ అని అన ర‌ఘువీరా.. ఇదే స‌మ‌యంలో ఏపీకి హోదా రాక‌పోయిన దురాగ‌తంలో చంద్రబాబు పాత్ర కూడా ఉంద‌ని, నోట్ల ర‌ద్దు విష‌యం తెలియ‌గానే... తానే పెద్ద నోట్లు ర‌ద్దు చేయ‌మ‌ని ప్రధాని మోడీకి చెప్పానంటూ ప్రక‌టించిన చంద్రబాబు ఉదంతాన్ని సైతం ర‌ఘువీరా విమ‌ర్శించ‌క‌పోవ‌డం, కొత్త మిత్రులు అంటూ వ్యాఖ్యానించ‌డం వంటివి.. ఏపీ కాంగ్రెస్ యూట‌ర్న్ తీసుకుంద‌నే వ్యాఖ్యల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News