మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేశారా? ఆయన జిల్లాల పర్యటనలు వివాదాస్పదం అవుతుండటంతో లోకేష్ జిల్లా పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారా? అవుననే అంటున్నారు. మంత్రి నారా లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, అటు పార్టీ నేతల పంచాయతీలు తీర్చలేక సతమతమవుతున్నారు. పార్టీకి ఎక్కువ సమయం చంద్రబాబు కేటాయించే అవకాశం లేకపోవడంతో నారా లోకేష్ పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు.
జిల్లా పర్యటనలకు ప్లాన్.....
వారానికి మూడు రోజులు అమరావతిలో ఉండేలా, మరో మూడు రోజులు జిల్లాలను పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. మంత్రి లోకేష్ పర్యటన వివరాలు జిల్లా పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్లాయి. వివిధ జిల్లాల్లో ఉండే శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు ఏవైనా ఉంటే వెంటనే కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని కూడా నేతలకు చెప్పారు. ఈ ప్రకారమే లోకేష్ చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను పర్యటించారు. ప్రకాశం జిల్లాలోని చీరాలలో లోకేష్ ఎదుటే విభేదాలు బహిర్గత మయ్యాయి. అక్కడ పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ చీరాలలోని ఎమ్మెల్సీ పొతుల సునీతకు అండగా నిలుస్తున్నారు.
ఆమంచి రాజీనామా అస్త్రం....
ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు ఎమ్మెల్సీ పోతుల సునీతకు పొసగడం లేదు. అయితే చీరాల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నారాలోకేష్ ఇద్దరి మధ్య విభేదాలను తొలగించకపోగా, దామచర్ల జనార్థన్ ను వెనకేసుకు రావడంతో ఆమంచి హర్ట్ అయ్యారు. తాను పార్టీ వీడేందుకు సిద్ధమని ఆయన పార్టీ అధినేతకు సంకేతాలు పంపారు. అలాగే లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన కూడా వివాదాస్పదమయింది. కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి తరహాలో స్వాగతం లభించింది. సంబంధిత మంత్రులను కాదని లోకేష్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం కూడా చర్చనీయాంశమైంది.
టీజీ వెంకటేశ్ ఫైర్ అవ్వడంతో...
దీంతోపాటుగా అక్కడ వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. కర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న టీజీ కుటుంబం నిరాశ చెందింది. టీజీ వెంకటేశ్ అయితే తెలుగుదేశం పార్టీలో కొత్త సంస్కృతికి లోకేష్ తెరతీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వద్దనే తేల్చుకుంటానని చెప్పారు. టీజీ వర్గం లోకేష్ పర్యటనకు కూడా దూరంగా ఉంది. లోకేష్ జిల్లాల పర్యటనలతో వివాదాలు తలెత్తడంతో ఆయనను కొద్దిరోజుల పాటు అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు అమరావతిలో టాక్ విన్పిస్తుంది. లోకేష్ తండ్రికి భారం తగ్గిద్దామని జిల్లా పర్యటనలకు ప్లాన్ చేసుకుంటే....అది బూమ్ రాంగ్ అవుతుందని భావించిన బాబు లోకేష్ ను పర్యటనలు వద్దని వారించినట్లు పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.