జగన్ తో జట్టుకు పవన్ రెడీనా...?

Update: 2018-06-09 13:30 GMT

వచ్చే ఎన్నికల్లో రణరంగం అంతా గందరగోళం గా వుంది. ఏపీలో జనసేన తో ఏ పార్టీ పొత్తు ఖాయం చేసుకుంటే ఆ పార్టీకి విజయావకాశాలు క్లిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అధికార తెలుగుదేశంతో గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని జనసేన ఆ పార్టీ పూర్తి మెజారిటీతో పీఠం ఎక్కేలా చేసింది. టిడిపి, బిజెపి కూటమి అఖండ విజయంలో పవన్ సేన పాత్ర పూర్తిగా వుంది. అలా వారికి మద్దతు ఇచ్చినందుకు ఒక్క సీటు కోరుకోలేదు జనసేన. పోటీకి సిద్ధమైన నేపథ్యంలో 75 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి పవన్ లిస్ట్ రెడీ చేశారు కూడా. కానీ చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్ళి జనసేన పోటీ టిడిపి గెలుపును నిరోధిస్తుందంటూ బుజ్జగించారు. ఫలితంగా ఒక్క సీటులో కూడా జనసేన పోటీ చేయలేదు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ నర్సీపట్నం సభలో స్పష్టం చేయడం విశేషం.

అందుకేనా సంకేతాలు ...?

తాజాగా పలు సభల్లో పవన్ గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తప్పేనంటూ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసినా గెలిచే స్థానాలను పొత్తుతో దక్కించుకోవాలన్న ఆలోచన జనసేన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సిపిఐ, సిపిఎం లతో సఖ్యత గా వున్న పవన్ గత ఎన్నికల్లో 75 అసెంబ్లీ 9 పార్లమెంట్ స్థానాలు కోరుకున్నట్లు ప్రకటించడంతో ఈసారి ఆయన అదే ఆఫర్ ముందుకు తెస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓట్ల చీలిక టిడిపి, వైసిపి లలో ఎవరో ఒకరికి లబ్ది చేకూర్చడం తప్ప జనసేన పార్టీ పరంగా లాభపడేది ఏమి ఉండదని అదే పొత్తు తో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో బాటు అధికారాన్ని పంచుకునే అవకాశం ఉంటుందన్నది పవన్ ఆలోచిస్తున్నారా అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వైసిపి ఎస్ అంటుందా.... ?

అధికారానికి దగ్గరగా వచ్చి గత ఎన్నికల్లో దెబ్బతిన్న వైసిపి ఈసారి రెట్టించిన ఉత్సహంతో రాబోయే కురుక్షేత్రానికి సమాయత్తం అవుతుంది. ఆ పార్టీ కర్త కర్మ క్రియ అన్ని అయిన జగన్ గత నాలుగేళ్లుగా ప్రజాక్షేత్రంలోనే గడుపుతున్నారు. తాజాగా రాబోయే ఎన్నికల కోసం జగన్ చేస్తున్న మారథాన్ పాదయాత్ర వైసిపి ని గెలుపు తీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ వర్గాలు ధీమాగా వున్నాయి. పొత్తులపై పెద్దగా ఆసక్తి లేని జగన్ స్ట్రైట్ ఫైట్ నే ఎంచుకోవడమే గత ఎన్నికల్లో దెబ్బ కొట్టింది. పవన్ తో చేతులు కలిపితే గ్యారంటీ అధికారం అని ముందే చెప్పిన వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట ఆయన ఏ మేరకు పాటిస్తారు అన్నది ఇప్పట్లో తేలేది కాదు. కానీ ఎన్నికల ముందు చర్చలు మొదలైతే జనసేన అడిగేది మాత్రం 75 అసెంబ్లీ 9 పార్లమెంట్ అన్నది స్పష్టం అయిపొయింది. దీనిపై బేరసారాలు జరిగితే చిన్న చిన్న మార్పులు వుండే అవకాశాలు వున్నాయి. మరో పక్క వీరిద్దరూ కలిసి పోటీ చేయడం అనుమానమే అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరు వుండరన్న లోకోక్తి ఏదైనా జరగొచ్చన్న సంకేతాలు ఇస్తుంది.

Similar News