మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ తాజాగా వేస్తున్న ఎత్తులు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బెంగాల్ కు చెందిన దాదాకు కాంగ్రెస్ తో ఐదు దశాబ్ధాల అనుబంధం ఉంది. ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు నెరిపారు. పార్టీకి అన్నివేళలా అండగా ఉంటూ వచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ రుణం తీర్చుకునేందుకు ఆయనను రాష్ట్రపతిని చేసింది. అయితే, యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2009లో తనను ప్రధానిని చెస్తుందని ప్రణబ్ భావించారని కానీ మళ్లీ మన్మోహన్ సింగ్ నే ప్రధానిని చేయడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఇక కాంగ్రెస్ లో ఛాన్స్ లేదనే..
రాష్ట్రపతిని చేసినా ప్రణబ్ కు ప్రధాని పదవిపై ఆశ చావలేదని, ఇందుకు ఇటీవలి కాలంలో ఆయన అడుగులే రుజువు అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రధాని అయ్యే ఛాన్స్ లేదని, ఇటీవలి రాహుల్ ప్రకటనతో తేలిపోయింది. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని తానే అని రాహుల్ తేల్చేశారు. దీంతో ప్రణబ్ ప్రత్నామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిస్తోంది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు వేగంగా జరుగుతన్నాయని జాతీయ మీడియా అంటోంది. బెంగాల్ కు చెందిన ప్రణబ్ కు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రాజకీయంగా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో మమత..ప్రణబ్ సూచనలతోనే ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని వినిపిస్తోంది. కేసీఆర్, మమతల భేటీ కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు.
సిటిజన్ ముఖర్జీగా మారి..
ప్రణబ్ కూడా తనకు తాను ప్రధాని రేసులో ఉండబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఆయన ప్రణబ్ ముఖర్జీగా ఉన్న ఆయన ట్విట్టర్ ఖాతాను సిటిజన్ ముఖర్జీగా మార్చుకున్నారు. అంటే, తాను సామాన్య వ్యక్తినే అని చెప్పుకుంటున్నట్లుగా కనపడుతోంది. ఇక వచ్చే నెలలో జరుగనున్న ఆరెస్సెస్ సమావేశానికి ప్రణబ్ ముఖ్యఅతిథిగా హాజరుకానుండటం కూడా సంచలనంగా మారుతోంది. ఆయన ఈ సమావేశానికి హాజరైతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇక ప్రణబ్ ప్రయత్నాలకు సంబంధించి మరో రుజువును కూడా చూపుతోంది మీడియా. కొన్నిరోజుల క్రితం జరిగిన బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో పాల్గొన్న ప్రణబ్..వివిధ పార్టీల నేతలకు వింధు ఇచ్చారని తెలుస్తోంది. ఈ సమావేశం ఈ ఏడాది జనవరి నెలలో జరిగినట్లు చెబుతున్నారు. ఈ విందులో నవీన్ పట్నాయక్ తో పాటు, దేవెగౌడ, సీతారాం ఏచూరీ, అద్వాణీలు పాల్గొన్నారు. అయితే, భిన్నదృవాలైన అద్వాణీ, ఏచూరీ తో ఫ్రంట్ చర్చలు జరిపే అవకాశం ఉందా అంటే అనుమానమే. కానీ , ప్రణబ్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లు మాత్రం గట్టి మద్దతు ఇస్తున్నారని తెలిసింది. దీంతో పాటు యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ప్రణబ్ కు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోదీని ఎదుర్కొనే ఫ్రంట్ కు ప్రణబ్ నాయకత్వం ఉంటేనే ధీటుగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా.