రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రత్యర్థులకు గట్టి షాకిచ్చేలా నేతలు ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార టీడీపీ.. ఈ క్రమంలో ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా విపక్షం వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్‌నే ఓడించడం ద్వారా ఆ పార్టీలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, తద్వారా కేడర్‌లో గందరగోళం సృష్టించి చివరికి పార్టీ రూపు రేఖలనే సమూలంగా పెకిలేయాలని చంద్రబాబు వ్యూహాలు రచించారు. వీటిని అమలు చేసేందుకు పార్టీలోని సీనియర్ మోస్టులకు బాధ్యతలు సైతం అప్పగించారు. దీంతో ఇప్పడు జగన్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. అత్యంత ఆసక్తిగా ఉన్న ఈ పరిణామాల క్రమం ఇదీ.
పులివెందులలో అభివృద్ధి.....
వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి కడపలో పాగా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనే ఓటమి పాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కడపలో ముఖ్యంగా పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలు, కృష్ణా జలాలు, వైసీపీ నుంచి చేరికల ఆసరాగా సంఖ్య పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే టీడీపీకి దక్కింది. మిగిలిన అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం చూపిస్తున్నా టీడీపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం.. విభేదాలతో తరచూ వీధికెక్కడం ఆ పార్టీకి సమస్యగా మారింది. అయినా ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ వైసీపీకి గట్టి సవాల్ విసిరింది. అయితే, ఈ టెంపోను వచ్చే ఎన్నికల వరకు కొనసాగించి.. జగన్‌నే ఓడించాలని బాబు వ్యూహం పన్నారు.
వైఎస్ కుటుంబానికే పట్టం....
జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో సంబందం లేకుండా ఇక్కడి ప్రజలు వైఎస్ కుటుంబానికే పట్టం గడుతున్నారు. వైఎస్ జీవించి ఉన్న రోజుల నుంచి ఇప్పటి వరకుకూడా ఈ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ అధీనంలోనే ఉంది. ఇక్కడ ఏ గడప చూసినా వైఎస్ ఫొటోనే కనిపిస్తుంది. ఎవరిని కదిపినా.. వైఎస్ పేరే వినిపిస్తుంది. మరి అలాంటి చోట టీడీపీ గెలవాలంటే.. అంత ఈజీకాదు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసే చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మళ్లీ జగనే పోటీ చేయనున్నారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డిని బరిలోకి దింపాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. టీడీపీ నుంచి రారగోపాల్‌రెడ్డి కూడా ఈ టికెట్‌ను ఆశిస్తున్నారు.
సతీష్ రెడ్డిని బరిలోకి దింపి.....
అయితే, గెలుపు గుర్రంగా భావిస్తున్న సతీశ్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని సమాచారం. ఇక, ఇక్కడ బరిలో ఎవరున్నా.. టీడీపీ నాయకులు మూకుమ్మడిగా ఇక్కడ వాలిపోయి.. జగన్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయనున్నారు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు.. సీఎం.రమేష్, బీటెక్ రవిలు అటు పొలిటికల్‌గాను ఇటు ఆర్థికంగాను కూడా జగన్‌ను దెబ్బకొట్టాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మండలాలను వారు పంచుకుని మరీ టీడీపీని బలోపేతం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరేలా నేతలు పోరుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ అక్కడ ఓడించడం సాధ్యం కాదన్నది విశ్లేషకుల మాట.