ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం చంద్రబాబునాయుడికి కర్ణాటక ఫలితాలు కలవర పెడుతున్నాయి. తన నాయకత్వం, పరిపాలన పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు కన్నడ నాట ఫలితాలను చూసి కొంత కంగుతిన్నారని చెబుతున్నారు. చంద్రబాబునాయుడు నిన్నమొన్నటి వరకూ తన అభివృద్ధి తనను విజయపథాన నడిపిస్తుందని చెప్పుకుంటూ వస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు తనను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయన్న పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక నెల రోజుల నుంచి చంద్రబాబు వాయిస్ మారింది కాని అంతకు ముందు అంతా ఆయన అభివృద్ధి మంత్రాన్నే పఠించేవారు. నెల రోజుల నుంచి అభివృద్ధిని పక్కనపెట్టి ప్రత్యేకహోదా నినాదాన్ని, మోడీ, బీజేపీపై తిట్ల దండకాన్ని అందుకున్నారు.
ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకున్నా.....
నిజానికి కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయన సంక్షేమ కార్యక్రమాలను బాగానే అమలుపర్చారన్న వాదన ఉంది. అంతేకాకుండా ఇందిరమ్మ క్యాంటిన్లు కూడా సిద్ధూకు ఎంతో పేరు తెచ్చాయని చెబుతారు. అలాగే రైతు సంక్షేమం కోసం కూడా సిద్ధరామయ్య తీసుకున్న చర్యలు మామూలుగా లేవంటారు. అలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్యతో పాటు 16 మంది మంత్రులు ఓటమి పాలవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకుండా పోతోంది. ప్రజలు సంక్షేమం వైపు కాకుండా ఎటువైపు చూశారన్న ఆసక్తి కర చర్చ కన్నడనాట జరుగుతోంది. బీజేపీ పోల్ మేనేజ్ మెంట్, ప్రచార హోరుతోనే అత్యధిక సీట్లను సాధించిందని కూడా చెబుతున్నారు.
నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు....
మరి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ, పింఛన్లు, పోలవరం వంటి విషయాల్లో ప్రజలు తనకు మరోసారి అవకాశమిస్తారని ఆయన భావిస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, త్వరలో ప్రారంభించబోయే అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని విశ్వసిస్తున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు దాదాపు 75 శాతం ప్రజలు సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల సంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ చంద్రబాబు అదే ప్రధానంగా చెప్పారు.
ఇక సెంటిమెంటే శరణ్యమా?
ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. కొత్తగా నిరుద్యోగ భృతిని త్వరలో విడుదలచేయాలన్న సంకల్పంలో ఉన్నారు. అంతకు మించి చంద్రబాబు ఈ ఏడాది కాలంలో ఎటువంటి మ్యాజిక్ చేయలేరన్నది విశ్లేషకుల అంచనా. ఖజానా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇప్పటికే మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను కూడా అమలు చేయలేని పరిస్థితి. కొత్త పథకాలను ప్రకటించినా అది వర్క్ అవుట్ కాదు. ఇక చంద్రబాబు ముందున్నది సెంటిమెంట్ మాత్రమే. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతస్థాయికి తీసుకెళ్లి, బీజేపీని, వైసీపీని ఒక గాట కట్టేస్తే తనకు వచ్చే ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత మంత్రులతో జరిగిన ఇష్టాగోష్టిలో సయితం చంద్రబాబు ఇదే భావనను వెల్లడించారని తెలుస్తోంది. మొత్తం మీద సిద్ధూ దెబ్బకు చంద్రబాబు తన రూటు మార్చుకోవాల్సిందేనంటున్నారు ఆ పార్టీ నేతలు.