శిల్పా మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఇక పోటీలోకి దిగకూడదని భావించారా? అవుననే అంటున్నారు. గత ఉప ఎన్నికల్లో ఓటమి భారం ఒకవైపు, మరోవైపు ఆరోగ్య సమస్యలు శిల్పాను సతమతం చేస్తున్నాయి. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శిల్పామోహన్ రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల్లో పనిచేశారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ నంద్యాల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న శిల్పా టిక్కెట్ రాకపోవడంతో వైసీపీలోకి మారారు.
ఓటమిని తట్టుకోలేక......
నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది. ఆయన కొద్దితేడాతో ఓటమి పాలయినా పెద్దగా బాధపడే వారు కాదు. 2014 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిపై కేవలం నాలుగువేల ఓట్ల తేడాతో టీడీపీ తరుపున పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాని భూమా మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం దాదాపు ముప్ఫయి వేల మెజారిటీతో ఓటమి పాలు కావడం శిల్పా మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి శిల్పా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని తెలుస్తోంది.
ఛాలెంజ్ చేసినందుకేనా?
ఆయన ఉప ఎన్నికల సందర్భంగా ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. తాను ఓటమిపాలయితే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మంత్రి అఖిలప్రియకు సవాల్ కూడా విసిరారు. మంత్రి అఖిలప్రియ కూడా తాము ఓటమి పాలయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అప్పట్లో సంచలనం కల్గించారు. ఈనేపథ్యంలో ఓటమి పాలయిన శిల్పా రాజకీయ సన్యాసం తీసుకోవడమే మేలని భావిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సయితం పోటీ చేయడానికి కూడా ఆయన అయిష్టత కనబరుస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత జగన్ కు కూడా సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
తనకంటే చిన్నవయస్సున్న.....
తనకంటే వయసులో, అనుభవంలో చిన్నవాడైన భూమా బ్రహ్మానందరెడ్డి పై ఓటమిని శిల్పా తట్టుకోలేకపోతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తన తనయుడు శిల్పా రవిని రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవి పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు. పార్టీ క్యాడర బాగోగులు కూడా శిల్పా రవి చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి పోటీగా రవిని బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు రవి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మరోవైపు శిల్పా మోహన రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీశైలం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.