వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడటంలో దిట్ట. ఇప్పటికే ఆయన చంద్రబాబుపై అనేక అంశాలపై విరుచుకుపడుతూవస్తున్నారు. చివరకు చంద్రబాబు టీటీడీ నిధులను కూడా తరలిస్తున్నారని సంచలన విమర్శలు చేశారు. అయితే ఆయన తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గంటా తమతో టచ్ లో ఉన్నారన్న విజయసాయి వ్యాఖ్యలు టీడీపీలోనూ చర్చనీయాంశమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోని ముఖ్య నేతలతో టచ్ ఉన్నారని, తమ పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు విజయసాయి వెల్లడించారు.
అనేక పార్టీలు మారి.....
నిజానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే అనేక పార్టీలు మారారు. తొలుత తెలుగుదేశం పార్టీ ఆపైన ప్రజారాజ్యం అక్కడ నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు. గంటా అదృష్టం ఏమో గాని ఆయన ఏ పార్టీలోకి మారితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజారాజ్యం పార్టీలోకి మారినా అది అధికారంలోకి రాకపోయినా తర్వాత ఆ పార్టీ అధినేత చిరంజీవి దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశంలోకి వచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ మంత్రి అయ్యారు.
అధికారంలో ఉన్న పార్టీలోకి.....
కాని గంటా శ్రీనివాసరావుది నిలకడలేని మనస్తత్వమన్నది విశాఖ జిల్లా వాసులందరికీ తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చే పార్టీని గుర్తించి అందులోకి మారిపోతారన్నకామెంట్స్ కూడా విన్పిస్తుంటాయి. 2014 తర్వాత గంటా తొలుత వైసీపీలోకి రావాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే వైసీపీ అధినేత జగన్ ఇందుకు కొన్ని షరతులు విధించడంతో ఆయన సైకిల్ ఎక్కేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ గంటాకు, స్థానిక నేతలకు పొసగడం లేదు. మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్ లతో పొసగడం లేదు.
విజయసాయి వ్యూహం ఇదేనా?
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. గంటా తమ పార్టీలోకి మారకపోయినా, ప్రజల్లో ఆయనను చులకన చేసేందుకు, పార్టీలో ఆయన్ను బలహీనపర్చేందుకు విజయసాయి ఈ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడయినప్పటికీ ఆయన గత కొద్దిరోజులుగా విశాఖ జిల్లాపైనే దృష్టి సారించారు. విశాఖలో పాదయాత్ర కూడా గత కొద్దిరోజులుగా చేస్తున్నారు. ఈనేపథ్యంలో విజయసాయి గంటా పై చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. మొత్తం విజయసాయిరెడ్డి ఆడిటర్ గానే అందరికీ తెలుసు. కాని పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మైండ్ గేమ్ ఆడటంలో దిట్టగా పేరుతెచ్చుకున్నారు.