బీజేపీలో సీనియర్ నేత, విద్యార్థి నేతగా ఎదిగిన కీలక నాయకుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఆయన ఏ విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు? రాబోయే రోజుల్లో ఆయన వ్యవహారశైలి ఎలా ఉండనుంది? వంటి కీలక విషయాలు తాజాగా చర్చకు వస్తున్నాయి. విశాఖపట్నం ఉత్తర నియోకవర్గం నుంచి 2014లో పోటీ చేసి గెలుపొందారు విష్ణుకు మార్ రాజు. వాస్తవానికి అప్పటి టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా విష్ణుకు ఆ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకట్రావుపై 18000 పైచిలుకు ఓట్ల ఆధిక్యత సాధించారు. నాడు విష్ణు ఏకంగా 82079 ఓట్లు తెచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత విష్ణుతోనే విశాఖ సిటీలో వైసీపీ జెండా అసెంబ్లీలో ఎగిరింది.
నిన్నటి వరకూ టీడీపీకి అనుకూలంగా....
అప్పటి నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు కూడా ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కంటే.. అధికార టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు నేరుగా భాగస్వామ్యం లేనప్పటికీ.. ఉన్నట్టుగానే ఆయన వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నాలా పన్ను తగ్గింపు/రద్దు బిల్లు విష యంలో ఏమీ తేల్చకుండా తాత్సారం చేస్తూ వచ్చిన గవర్నర్‌పై నేరుగా విరుచుకుపడ్డారు. గవర్నర్ చేస్తున్న నిర్వాకం వల్ల ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేక పోతోందంటూ.. విమర్శలు సైతం గుప్పించారు. చంద్ర బాబును మహానాయకుడిగా పోల్చి.. అసెంబ్లీలో అందరినీ నివ్వెరపరిచాడు.
బాబుపై ప్రశంసలు....
ఇక, పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకమైందని, కడితే బాబు మాత్రమే కట్టగలరని పొగడ్తలు కురిపించేవారు. అదేసమయంలో విపక్షం వైసీపీపై నిప్పులు చెరిగేవారు. ఇక, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని రాష్ట్ర టీడీపీ నేతలు ఇరుకున పెట్టినా విమర్శించినా విష్ణు ఎప్పుడూ నోరు మెదపలేదు. దీంతో అందరూ విష్ణు అసలు బీజేపీ నాయకుడా? టీడీపీలోచేరారా? అని చర్చించుకునేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీడీపీ.. బీజేపీతోను, ఎన్డీయేతో నూ బంధాన్ని తెంచుకున్న నేపథ్యంలో విష్ణు కూడా తన స్వరం మార్చుకున్నాడు. కాబోయే సీఎం జగనే నంటూ వ్యాఖ్యలు కుమ్మరించాడు. దీంతో అసలు విష్ణు రాజకీయాల్లో ఇలాంటి కుప్పిగంతులు ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జగన్ ను కలుస్తానని చెప్పి.....
ఇక వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాకు వస్తే తాను కలుస్తానని.. పార్టీ పరంగా కాకపోయినా మామూలుగా అయినా తాను ఆయనతో మీట్ అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విష్ణు వైసీపీలోకి వెళుతున్నారా ? అన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణంగా మారింది. నిన్న మొన్నటి వరకు బీజేపీని పొగిడిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీని బద్నాం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు విష్ణు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా ఇప్పుడు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా మారడంతో ఏం చేయాలా అని ఆయన ఆలోచిస్తున్నాడు.
వారు దిగితే.....
ఏపీలో బీజేపీకి ఫ్యూచర్ లేదన్నది అందరూ చెప్పేస్తున్నారు. ఇది విష్ణుకు కూడా తెలియంది కాదు.. పోనీ.. వైసీపీలో చేరదమా? అంటే అది కూడా అయ్యే పనికాకుండా ఉంది. ఈ నేపథ్యంలో కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా విష్ణుకుమార్ రాజు అల్లాడిపోతున్నాడని అంటున్నారు. అందుకే పొలిటికల్ ఫ్యూచర్ ఉండాలంటే పార్టీ మారడమే బెటర్ అని ఆయన డిసైడ్ అయ్యారన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రస్తుతం విష్ణు ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వహిస్తోన్న విశాఖ ఉత్తరంలో యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పోటీచేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ మాజీ నేత, ఇంకా టీడీపీలోకి చేరని సబ్బం హరితోపాటు మరికొందరు నగర టీడీపీ నేతల పేర్లు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. వీరిలో రమేష్, సబ్బం హరిలు రంగంలోకి దిగితే.. విష్ణుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.