ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. టీడీపీ-వైసీపీ మధ్య ఈసారి హోరాహోరీ పోరు తప్పదని తేలిపోయింది. దీంతో నాలుగేళ్లు స్తబ్దుగా ఉన్న నాయకులు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు తమకు అనుకూలమైన పార్టీలో చేరిపోగా.. మరికొందరు సందిగ్ధంలో పడిపోతున్నారట. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరూ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
వైసీపీకి ఎదురుదెబ్బేనా?
ప్రతిపక్ష నేత జగన్ సామాజికవర్గానికి చెందిన వారితో పాటు బలమైన క్యాడర్ ఉన్న నేతలు కావడంతో ఈ పరిణామం ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బే అని అంచనా వేస్తున్నారు. ప్రకాశంలో టీడీపీకి చెప్పుకోదగ్గ క్యాడర్ ఉన్నా.. ఇక్కడ వైసీపీదే పైచేయి. దీంతో ఇక్కడ బలపడేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు ముదిరిపోవడం కూడా పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇతర పార్టీల్లో బలమైన నాయకులను ఆకర్షించేందుకు మంతనాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇద్దరు బలమైన సామాజికవర్గ నేతలు పార్టీలో చేరేందుకు సంసిద్ధంగానే ఉన్నా.. ముందడుగు వేయలేకపోతు న్నారట.
కనిగిరి,కందుకూరు మాజీ ఎమ్మెల్యేలె.....
ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు కందుకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంకా పార్టీలో చేరే ముహూర్తం మాత్రం ఖరారు కాలేదు. కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి మెరుగైన అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన పోతుల రామారావు.. పార్టీ ఫిరాయించడంతో తగిన నాయకుడి కోసం ఎదురుచూస్తోంది. ఇక్కడి నుంచి బరిలోకి దించేందుకు మాజీ మంత్రి మానుగుంట మహిందర్ రెడ్డి కోసం విపక్ష నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన చివరి వరకూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన సైకిల్ ఎక్కడానికి సిగ్నల్స్ ఇస్తున్నారు.
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.......
తాజాగా చంద్రబాబు ఓకే చెప్పడంతో ఇక సైకిల్ సవారీ షురూ కాక తప్పదనే ప్రచారం ఊపందుకుంది. కందుకూరులో పోతుల రామారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా, దివి శివరాం మాజీ ఎమ్మెల్యేగా టికెట్ రేసులో ఉన్నారు. దివి శివరాంకి ఇప్పటికే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటంతో మానుగుంట, పోతుల మధ్యలో పోటీ ఉంది. మానుగంటని ఎమ్మెల్సీ చేయడానికి మాత్రమే చంద్రబాబు అంగీకరించారని టీడీపీలోని పోతుల వర్గం ప్రచారం చేస్తున్నారట. మానుగుంటకు తోడు ఉగ్రనరసింహరెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందట. ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నారు.
కదిరి బాబూరావుపై అసంతృప్తి.....
సామాజిక సమీకరణాల రీత్యా ప్రకాశం జిల్లాలో బలమైన సామాజికవర్గం నేతలు టీడీపీ లో చేరడం అత్యవసరం అని భావిస్తున్న చంద్రబాబు.. ఉగ్రతో కూడా టచ్ లో ఉండాలని టీడీపీ నేతలను ఆదేశించారట. బాలయ్యబాబు ముఖ్య స్నేహితుడు కదిరి బాబూరావు కనిగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనపై వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్ర నరసింహారెడ్డితో ఆ లోటు భర్తీ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరు బలమైన నేతలు, బలమైన సామాజికవర్గ నాయకులు.. టీడీపీలో చేరితే ఇప్పుడు అది వైసీపీకి తీరని నష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.