వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్ర మొండోడి కంచుకోటలోకి ఎంటర్ అయ్యింది. జగన్ మూడు రోజుల పాటు ఉండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఉండి నుంచి భీమవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది. ఇక జగన్ యాత్రేంటి మోండోడు ఏంటనుకుంటున్నారా ? పశ్చిమగోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే కలువపూడి శివరామరాజు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నీళ్ల కాల్వల్లోకి దిగి రోజాంతా కాల్వల్లోనే దీక్ష చేయడం, రైతులకు నిరంతర విద్యుత్ కోసం కంకరరాళ్ల మీద నడి వేసవిలో మండుటెండలో కాళ్లు బొబ్బలు ఎక్కి, రక్తం కారేలా దీక్ష చేసినా అనుకున్నది సాధించడం ఆయన నైజం.
వైఎస్ గాలి బలంగా వీచినా.....
మాజీ మంత్రి, ఉండి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరుసగా గెలిచిన కదిలిండి రామచంద్రరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన కలువపూడి శివరామరాజు గత రెండు ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009 ఎన్నికల్లో వైఎస్ గాలి బలంగా జిల్లాలో వీచినా శివ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుపై 17 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన శివ గత ఎన్నికల్లో అదే సర్రాజు వైసీపీ నుంచి పోటీ చేస్తే ఏకంగా 36 వేల ఓట్ల భారీ మెజార్టీతో తిరుగులేని విజయం సాధించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పార్టీ కార్యక్రమాలను తిరుగులేని విధంగా చేస్తూ దూసుకుపోతున్నారు. శివపై వ్యతిరేకత లేదు... చిన్నా చితకా సమస్యలు ఆయన ఇప్పుడు ఉన్న ఫామ్‌తో పోలిస్తే పెద్ద లెక్కలోనివి కావు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు శివ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు.
వైసీపీ క్యాండెట్ మార్పు...
2004లో వైఎస్ గాలిలో గెలిచి గత రెండు ఎన్నికల్లోనూ శివ చేతిలో చిత్తు చిత్తుగా ఓడుతోన్న పాతపాటి సర్రాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకున్నారు. తాను స్వయంగా తప్పుకుని ఉండి మండలం యండగండికి చెందిన సీవీఎల్.నరసింహారాజుకు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించేలా చేశారు. గతంలో సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సీవీఎల్‌కు నియోజకవర్గంలో పట్టులేదు. జగన్ ఇమేజ్, వైసీపీ వేవ్ బలంగా ఉంటే తప్ప ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో శివ మీద గెలవడం అసాధ్యం.పశ్చిమ డెల్టాలో బలంగా ఉన్న టీడీపీని ఢీకొట్టేందుకు జగన్ క్షత్రియుల్లో బలమైన మాజీ ప్రజాప్రతినిధులు, ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే, ఎన్నికల నాటికి వైసీపీ బలంగా పుంజుకుంటేనే ఇక్కడ ఆ పార్టీకి ఛాన్సులు ఉంటాయి.