జగన్ లో ధీమా పెరుగుతుంది. ఉప ఎన్నికల ఫలితాలతో వైసీపీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయంటున్నారు. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ జగన్ అవినీతి కేసుల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సయితం అదేపనిగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు జగన్ పార్టీలో జోష్ ను నింపాయని చెబుతున్నారు.
తిరుగులేదనుకున్న నితీష్.....
బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు తిరుగులేదు. ఆయన మచ్చ లేని వ్యక్తి. ఇప్పటి వరకూ ఎలాంటి అవినీతి ఆరోపణలను నితీష్ ఎదుర్కొనలేదు. గత ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ తో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన నితీష్ ఆ తర్వాత ఆ పార్టీ అవినీతిదంటూ బయటకు వచ్చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీతో కలసి మళ్లీ బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అవినీతి ఆరోపణలు...అభివృద్ధి.....
ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసులు పెట్టి జైలుకు పంపిందన్న ప్రచారం జోరుగా జరిగింది. గత డిసెంబరు నెలలో లాలూ జైలుకెళ్లారు. ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అరారియా లోక్ సభ స్థానాన్ని, జెహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా జరిగిన జోకీహాట్ అసెంబ్లీ స్థానాన్ని కూడా లాంతరు కైవసం చేసుకుంది. దీంతో అవినీతి ఆరోపణలను పెద్దగా పట్టించుకోరన్నది అర్థమైపోయిందంటున్నారు వైసీపీ నేతలు. అభివృద్ధి చేయకపోవడం వల్ల కూడా నితీష్ పై వ్యతిరేకత పెరిగిందంటున్నారు. ఇదే ఫార్ములా ఏపీకి కూడా అన్వయిస్తున్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు.
ప్రజలు నమ్మరంటున్న.......
తమ అధినేతపై కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయించిందన్న విషయం అందరికీ తెలిసిందేనంటున్నారు. లక్షల కోట్లు జగన్ దోచేశాడంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వారు గట్టిగా చెబుతున్నారు. బీహార్ ఉప ఎన్నికలే దీనికి ఉదాహరణ అని పేర్కొంటున్నారు. తమ అధినేతను కూడా జైలుకు పంపించాలని చంద్రబాబు విపరీతంగా ప్రయత్నించారని, ఈ నాలుగేళ్లలో ఢిల్లీ వెళ్లినప్పుడల్లా జగన్ కేసుల గురించే వాకబు చేశారంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద బీహార్ లో లాంతరు విజయం ఇక్కడ ఫ్యాన్ పార్టీ నేతల్లో జోష్ నింపిందనే చెప్పాలి. పదేపదే చంద్రబాబు ఆయన పార్టీ సభ్యులు తమ అధినేతపై ఆరోపణలు చేస్తుంటేనే తమకు మేలు జరగుతుందంటున్నారు వైసీపీ నేతలు. అదండీ సంగతి....బీహార్ లాంతరు పార్టీకి... ఇక్కడ ఫ్యాన్ పార్టీకి ముడిపెట్టేసుకుని సంబరపడిపోతున్నారు జగన్ పార్టీ నేతలు.