జగన్ ను కాదనుకున్న వారే....?

Update: 2018-07-24 02:00 GMT

జగన్ గ్రాఫ్ పెరిగిందా? వచ్చే ఎన్నికల్లో తాను అనుకున్న చోట్ల ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రతో పార్టీ బలోపేతమయిందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వేలో కూడా వెల్లడయిందంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈసారి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖాతా కూడా తెరవని వైసీపీ ఈసారి మాత్రం డబుల్ డిజిట్ కు చేరుకుంటామని ఘంటాపధంగా చెబుతుండటం విశేషం. ఇదంతా జగన్ పాదయాత్ర మహిమవల్లనేనని చెబుతున్నారు స్థానికనేతలు.

పవన్ వల్ల ప్రమాదం లేదని......

ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు. పగలు పాదయాత్ర, రాత్రి నైట్ మీటింగ్ లతో జగన్ ఈ జిల్లాలో వ్యూహాన్ని సిద్ధంచేసినట్లు తెలిసింది. తొలుత తూర్పు గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం గణనీయంగా ఉంటుందని వైసీపీ భావించింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన, బీజేపీ మద్దతివ్వడం వల్లనే అత్యధిక సీట్లను ఆ పార్టీ తూర్పులో కైవసం చేసుకుంది. కానీ ఈసారి జిల్లాలో చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.

కాపు సామాజిక వర్గం కూడా.....

రాష్ట్రంలో ఎక్కడ బలమైన అభ్యర్థులు దొరక్కపోయినా తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం జనసేనకు మంచి అభ్యర్థులే దొరుకుతారు. గట్టి పోటీ కూడా ఇవ్వనున్నారు. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకు ప్లస్ అవుతుందన్నది వైసీపీ భావన. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పవన్ చీల్చే అవకాశమే లేదన్న నమ్మకంతో ఆ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఉన్నారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్న ఆ సామాజిక వర్గం ప్రజలు తమకే చేరువవుతారన్న విశ్వాసాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తుండటం విశేషం.

అంతర్గత సర్వేలో......

గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేశాయి. పవన్ కల్యాణ్ మద్దతు లభించింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 12 స్థానాలను తెలుగుదేశం పార్టీ, ఒక్క స్థానం బీజేపీ, మరొక స్థానం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన పిఠాపురం ఎమ్మెల్యే ఎవివిఎస్ వర్మ టీడీపీకే మద్దతు పలకడంతో 19 స్థానాల్లో టీడీపీకి 14 స్థానాలు లభించినట్లయింది. వైసీపీకి గత ఎన్నికల్లో ఐదు స్థానాలే దక్కాయి. ఈ ఐదింటిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో వైసీపీకి జిల్లా నుంచి ఇద్దరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రభావం బాగా పనిచేస్తుందని, జగన్ యాత్రకు విశేష స్పందన లభించడమేకాకుండా అంతర్గత సర్వేలో పదినుంచి పన్నెండు స్థానాలను దక్కే అవకాశముందని తెలియడంతో వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చినంత సంబర పడిపోతున్నారు.

Similar News