నిజంగా అదృష్టమంటే ఇదేనేమో..! కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ రావడంతో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు కలిసొచ్చింది. ఇదేమిటీ.. హంగ్ రావడం వల్ల యెడ్డీకి ఏంలాభమని అనుకుంటున్నారా..? ఇది నిజమేననీ కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగానే.. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడడం వల్లే యడ్యూరప్పకు సీఎం అయ్యే అవకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఉన్న మతలబు ఏమిటనీ ఆలోచిస్తున్నారా..? అయితే ఈ ఆసక్తికర కథనం చదవాల్సిందే.
మూడు వర్గాలుగా వీడి.....
2013ఎన్నికల్లో బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయింది. ప్రధానంగా బీజేపీ నుంచి యెడ్డీ, బీ శ్రీరాములు విడిపోయి వేరు కుంపటిలు పెట్టుకున్నారు. యడ్యూరప్పతో పాటు శ్రీరాములు కూడా సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ ఎన్నికల్లో కమలదళానికి పెద్ద దెబ్బ ఎదురైంది. అయితే బీ శ్రీరాములు మాత్రం పార్టీ ఏర్పాటు చేసి దానిని నిలబెట్టడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీ చేసి చావుదెబ్బ తింది. యుడ్యూరప్ప పార్టీకి 6 సీట్లు వచ్చాయి.
యువకుడు కావడంతో.....
ఇక ఆ తర్వాత బళ్లారి నుంచి ప్రస్థానం ప్రారంభించిన శ్రీరాములు కూడా సొంతంగా పార్టీ పెట్టి బీజేపీని చావు దెబ్బతీయడంతో ఆయన కూడా స్టేట్ లీడర్‌గా మారిపోయాడు. అంతేగాకుండా.. 75 ఏళ్ల కు పైగా వయస్సు ఉన్న యడ్యూరప్పతో పోల్చితే శ్రీరాములు యువకుడు కావడం.. ప్రజల్లోకి రాకెట్‌లా దూసుకెళ్లే తత్వం ఉండడంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. యడ్యూరప్ప కూడా ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసి, పెద్దగా ఏమీ సాధించలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడివిడిగా ఉండేకంటే కలిసి ఉంటేనే అందరికీ మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఇక ఇదేసమయంలో బీ శ్రీరాములుకు వ్యూహాత్మకంగా పార్టీ పెద్దలు అత్యంత ప్రాధాన్యత కల్పించారు.
ఇద్దరూ బయటకు వెళ్లి.....
ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పతోపాటు బీ శ్రీరాములు కూడా మళ్లీ బీజేపీ గూటి కిందకే వచ్చారు. అయితే లోపాయికారంగా పార్టీ అధిష్టానం బీ శ్రీరాములుకే ముఖ్యమంత్రి పదవి హామీ ఇచ్చినట్లు ఓ టాక్ అయితే బయటకు వచ్చింది. ఇప్పటకి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా స్టేట్ బీజేపీ పగ్గాలు శ్రీరాములుకు ఇస్తేనే బెటర్ అని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎంపీగా ఉన్న శ్రీరాములుకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బాదామి నియోజకవర్గంతోపాటు మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. అంతేగాకుండా.. బాదామి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌నేత, సీఎం సిద్ధరామయ్యపై ఆయనను బరిలోకి దింపారు. ఇక్కడ ఎలాగైనా సిద్దు ఓడించి, శ్రీరాములు సత్తా ఏమిటో ప్రజలతోపాటు, పార్టీ క్యాడర్‌కు చూపించాలని అనుకున్నారు. కానీ, కేవలం మూడువేల ఓట్ల తేడాతో సిద్దు చేతిలో శ్రీరాములు ఓడిపోయారుగానీ మరో నియోజకవర్గంలో మాత్రం ఆయన గెలిచారు.
మ్యాజిక్ ఫిగర్ చేరకపోవడంతో...
అయితే బీజేపీ పెద్దలు అనుకున్నట్లుగా పెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను మాత్రం సాధించలేకపోయింది. 104 సీట్లతో అధికారానికి కొద్దిపాటి దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్గతంగా శ్రీరాములును ముందుకు తెస్తే అసలుకే ఎసరు పడుతుందని గ్రహించిన పార్టీ పెద్దలు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇలా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడడం వల్లే యడ్యూరప్ప సీఎం అవకాశాలు మెరుగయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీకి మాత్రం పూర్తి మెజారిటీ వస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉండేదని పలువురు నాయకులు అంటున్నారు. కాగా, ఇప్పటికే బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన యెడ్డీ ఇప్పటికే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేగాకుండా గురువారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.