ఏపీ అధికార పార్టీ టీడీపీకి గడ్డు రోజులు ముంచుకొచ్చాయి. పార్టీని ప్రజల్లో బలోపేతం చేయాలని పార్టీ అధినేత చంద్ర బాబు.. ఒకపక్క పిలుపునిస్తుంటే.. పార్టీని ఎంతమేరకు బజారున పడేద్దామా అని నేతలు చూస్తున్నారు. వీరిలో ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైసీపీ నుంచి 2014లో గెలుపొందిన ఈయన తర్వాత చంద్రబాబు గూటికి చేరిపోయారు. ఈ క్రమంలోనే జగన్‌ను దెబ్బతీసే ఉద్దేశంతో ఆదికి.. చంద్రబాబు మంత్రిపదవి కూడా కట్టబెట్టారు. ఫలితంగా కడపలో పార్టీని బలోపేతం చేస్తాడని, జగన్‌కు కంట్లో నలుసుగా మారతాడని బాబు భావించారు. అయితే, ఆది మాత్రం యూటర్న్ తీసుకుని, చంద్రబాబుకే కంట్లో నలుసుగా మారడం గమనార్హం.
వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ.....
వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన ఆది.. వర్గ రాజకీయాలను ప్రోత్సహించడమే కాకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఇబ్బంది పాలు చేస్తున్న విషయం ఇటీవల దాకా వార్తల్లో వచ్చింది. ముఖ్యంగా తన సొంత జిల్లాలోనే ఆయన టీడీపీని బతికించడం పోయి.. టీడీపీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బద్వేలు టీడీపీ ఈ రోజు రెండు నుంచి మూడు ముఠాలుగా మారిపోయింది. దీనికి ఆది నారాయణే కారణమని చంద్రబాబుకు సైతం ఉప్పందింది. అదేవిధంగా జిల్లాలో పార్టీ నాయకులను కలుపుకొని పోవాల్సిన ఆది.. వారిలో విభేదాలు సృష్టించేందుకే ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
అంతర్గత విషయాలనూ.....
అంతేకాదు, పార్టీలో అంతర్గత విషయాలను కూడా బజారున పడేస్తున్నాడు. ఈ పరిణామాలతో టీడీపీ భ్రష్టు పడుతోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత, సీఎం రమేష్ ప్రతి పనికీ అడ్డొస్తున్నారని, కనిపిస్తే కాల్చివేత రోజులొ స్తాయని మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించడం పెను సంచలనానికి దారితీసింది. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయన్నారు. ప్రతి దానికి అడ్డుపడటమేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, తాను గన్‌లాంటి వాడిని.. కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని మంత్రి పేర్కొన్నారు.
రామసుబ్బారెడ్డిపై......
రెండు రోజలు క్రితం జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొంత మంది తమపై నీచంగా మాట్లాడుతున్నారని, తాను మార్కెట్ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమన్నారు. రామసుబ్బారెడ్డి గానీ, ఆయన వర్గీయులు దేనికి సిద్ధపడినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు. ఈ పరిణామాలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న కడప టీడీపీ పరువు పూర్తిగా బజారున పడుతోందని అంటున్నారు సీనియర్లు. ఏదేమైనా ఆదినారాయణరెడ్డితో కడప టీడీపీకి ప్లస్... జగన్‌కు మైనస్ అవుతుందని బాబు భావిస్తే ఇప్పుడు ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యేలా ఉంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.