ఏపీ విపక్షం వైసీపీలో టికెట్ల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఉన్న నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి ఈ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగు తున్న నాయకులతో టికెట్ల కోసం క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి ప్రకాశంలోని పరుచూరు నియోజకవర్గం విషయం మరింత చర్చకు దారితీసింది. ఇక్కడ వైసీపీలో నాయకులకు కొదవ లేకపోయినా.. మరింతగా పార్టీని గెలుపు గుర్రం ఎక్కించే నాయకుల కోసం పార్టీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ టికెట్‌ను రిజర్వ్ చేశారని అంటున్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీని......
ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ బలంగా ఉంది. దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావులు రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే, వీరు బీజేపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిని వైసీపీలోకి తీసుకురావాలని జగన్ జోరుగా ప్రయత్నిస్తున్నారు. వీరిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నాడు. పరుచూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఏలూరి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లోనూ ఈయనే ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజలకు చేరువ కావడం, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలోనూ సాంబశివరావు ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నారు.
బలమైన అభ్యర్థిని......
దీంతో వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున ఈయనకే టికెట్ ఇవ్వనున్నారని సమాచారం. ఈయనకు బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నాడు. వాస్తవానికి వైసీపీ తరఫున బరిలోకి దిగాలని నియోజకవర్గం ఇంచార్జ్‌గా గొట్టిపాటి భరత్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయనపై కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగించి అడుసుమిల్లి రాంబాబును నియమించారు. దీంతో టికెట్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఎవరికి కేటాయించినా మరొ వర్గం వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
రెండు స్థానాలను ఇచ్చేందుకు......
దీనికితోడు వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా టీడీపీకి బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జగన్.. దగ్గుబాటి ఫ్యామిలీని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈ దంపతులను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. వీరు వైసీపీలో చేరితో రెండు స్థానాలను ఇచ్చేందుకు కూడా జగన్ రెడీ గా ఉన్నారని సమాచారం. పురందేశ్వరికి కోరుకున్న స్థానంలో పార్లమెంటు నియోజకవర్గం టికెట్, అదేవిధంగా పరుచూరు అసెంబ్లీ సీటును కూడా కేటాయించేందుకు వైసీపీ రెడీగా ఉందని సమాచారం.
దగ్గుబాటి సంచలన నిర్ణయం తీసుకుంటారా?
అయితే, నిన్న మొన్నటి వరకు టీడీపీ-బీజేపీ కలిసి ఉండడంతో ఎటూ తేల్చుకోలేక పోయిన ఈ ఫ్యామిలీ.. ఇప్పుడు వైసీపీలోకి చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, తమ కుమారుడిని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో.. తమ కుమారుడికి పరుచూరు ఎమ్మెల్యే సీటును ఇస్తే దగ్గుపాటి ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. మరి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతోన్న వేళ ఇక్కడ ఏం జరుగుతుందో ? చూడాలి.