వైసీపీలో వరుస చేరికలు జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీలో కొంత కలవరం ప్రారంభమైంది. పేరున్న నేతలే ఫ్యాన్ పార్టీ వైపు చేరికకు మొగ్గుచూపుతుండటాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. వారు నేరుగా వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరుస చేరికలతో వైసీపీలో ఉత్సాహం ఉండగా, తెలుగుదేశం పార్టీలో మాత్రం కొంత గందరగోళం ఉందనే చెప్పాలి.
చంద్రబాబు సీరియస్.....
ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. మొన్నటి వరకూ తన పరిపాలనను చూసి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబు చెప్పేవారు. అయితే గత కొంతకాలంగా టీడీపీలో చేరికలు ఆగిపోయాయి. చిన్నా చితకా నేతలు సయితం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు. అలాగే వివిధ నియోజకవర్గాల్లో పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలు వీలయితే వైసీపీ...లేకుంటే జనసేనలో చేరాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
వర్గ విభేదాలతో.....
ఇటీవల జరిగిన దీక్షలు, మినీ మహానాడులు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలను బయటపెట్టాయి. రెండు గ్రూపులు వేర్వేరుగా మినీ మహానాడులను ఏర్పాుటు చేసుకోవడంతో పార్టీ నేతలే షాక్ తిన్నారు. ఒకరి కార్యక్రమాలకు మరొకరు హాజరు కాని పరిస్థితి. ఎదురెదురుపడకుండా ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో కొందరు వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు చంద్రబాబుకు ఇంటలిజెన్స్ నివేదిక అందింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి జగన్ ఓకే చెబితే చేరిపోవడానికి సిద్ధమవుతున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొందరు నేతలు వైసీపీలో టిక్కెట్ హామీ లభించకపోతే జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలియడంతో చంద్రబాబు ముఖ్యనేతలతో ఇటీవల సమావేశమై చర్చించారు.
వారిని తీసుకురండి.....
పేరున్న నేతలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేలా ప్రయత్నించాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రులతో పాటు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జులను కూడా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో టీడీపీ బలహీన పడిందేనే ప్రచారం వెళ్లకముందే వీలయినంత మంది నేతలను ఆకర్షించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇందులో ఒకరిద్దరు మంత్రులకూ టార్గెట్ విధించినట్లు చెబుతున్నారు. అలాగే సీనియర్ నేతలు మైసూరారెడ్డి, డీఎల్ రవీంద్ర రెడ్డిలతో చర్చించి వారిని వీలయినంత త్వరగా పార్టీలోకి తీసుకురావాలని కూడా చంద్రబాబు లక్ష్యాలను నేతలకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ, జనసేనల్లోకి నేతలు వెళ్లకుండా చూడాలని కొంచెం గట్టిగానే నేతలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.