తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌

ప్ర‌స్తుతం ఉత్త‌ర తెలంగాణ జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ ప‌రిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీనే బ‌లంగా మారింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌

Update: 2022-05-09 04:43 GMT

హైదరాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల్లో నెంబ‌ర్ - 2 స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య పోటీ తీవ్రంగా న‌డుస్తోంది. నాలుగేళ్ల క్రితం వ‌ర‌కు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఏకైక ప్ర‌త్య‌ర్థిగా, ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే ఉండేది. కానీ, 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు సీన్ మార్చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలిస్తే బీజేపీ అనూహ్యంగా నాలుగు సీట్లు గెల‌వ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పైచేయి సాధించింది. ఆ త‌ర్వాత దుబ్బాక‌, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డం ద్వారా కాంగ్రెస్ స్థానాన్ని క్ర‌మంగా బీజేపీ ఆక్ర‌మించుకుంటూ వ‌చ్చేస్తోంది.

ప్ర‌స్తుతం ఉత్త‌ర తెలంగాణ జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ ప‌రిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీనే బ‌లంగా మారింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే బ‌లంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఉమ్మ‌డి న‌ల్గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, మెద‌క్ జిల్లాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగ్గా ఉంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో రెండు పార్టీలు స‌మానంగా క‌నిపిస్తున్నాయి. ఇదే ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా కొన‌సాగితే రాష్ట్రంలో హంగ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.
టీఆర్ఎస్‌ను ఓడించాలంటే రాష్ట్ర‌మంతా బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం కాంగ్రెస్‌, బీజేపీల‌కు ఏర్ప‌డింది. ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ అయితే ప్ర‌త్యామ్నాయంగా నిలుస్తుందో.. ఆ పార్టీకే ఎక్కువ సీట్ల‌లో విజ‌యావ‌కాశాలు ఉంటాయి. అందుకే, కాంగ్రెస్‌, బీజేపీలు పైచేయి కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రైతు సంఘ‌ర్ష‌ణ స‌మితి పేరుతో భారీ స‌భ నిర్వ‌హించి రాహుల్ గాంధీని ర‌ప్పించింది.
ఈ స‌భ విజ‌య‌వంతం కావ‌డం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికీ కాంగ్రెస్ బ‌లంగానే ఉంద‌ని ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. స‌భ‌లో రైతుల కోసం ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌పైన చ‌ర్చ బాగా జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంట‌ర్లు కూడా ఎక్కువ‌గానే ఉండ‌టంతో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌గా రాష్ట్ర రాజ‌కీయాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ప్ర‌స్తావ‌న ఎక్కువ‌గా లేకుండా పోయింది. ఈ ప‌రిస్థితి ఎక్కువ రోజులు కొన‌సాగిస్తే త‌మ‌కు న‌ష్టంగా బీజేపీ భావిస్తోంది.
అందుకే, రాహుల్ గాంధీ స‌భ‌ను మించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సభ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేస్తున్న ప్ర‌జా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు స‌భ రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని తుక్కుగూడ‌లో ఈ నెల 14న జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఈ స‌భ టీబీజేపీ నేత‌ల‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా మారింది. రాహుల్ గాంధీ వ‌రంగ‌ల్ స‌భ కంటే ఎక్కువ జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని బీజేపీ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి జ‌న‌స‌మీక‌ర‌ణ చేయ‌నున్నారు.
ఈ స‌భ‌ను గ్రాండ్ స‌క్సెస్ చేయ‌డం ద్వారా బీజేపీ కూడా బ‌లంగా ఉంద‌నే సిగ్న‌ల్ ఇవ్వాల‌నేది ఆ పార్టీ నేత‌ల ఆలోచ‌న‌. ఎన్నిక‌లకు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌గానే కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య ఇంత పోటీ ఉందంటే రానున్న రోజుల్లో మ‌రింత పోటీ పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రి, కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య జ‌రుగుతున్న ఈ సెమీ ఫైన‌ల్‌లో ఎవ‌రు గెలిచి ఫైన‌ల్‌లో టీఆర్ఎస్ పార్టీతో త‌ల‌ప‌డ‌తార‌నేది వేచి చూడాలి.


Tags:    

Similar News