KCR : ఇప్పటికైనా మారతావా బాసూ.. ఆ ఒక్కటీ మాత్రం వాళ్లకే ఇచ్చేయవూ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Update: 2024-02-02 02:29 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై లోక్‌ సభ ఎన్నికలపైనే చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా ఆయన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి సిట్టింగ్‌లకు కాకుండా కొత్త వాళ్లకు అవకాశమివ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న మొత్తం పదిహేడు లోక్‌సభ నియోజకవర్గాల్లో పది స్థానాలను గెలుచుకుంటేనే పార్టీ పరువుతో పాటు తన ఇమేజ్ కూడా చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

సిట్టింగ్ లకు నో ఛాన్స్...
కొందరి సిట్టింగ్‌లకు మాత్రం ఆయన తిరిగి టిక్కెట్లు ఇచ్చే అవకాశముంది. ఎక్కువ మందిని మాత్రం మార్చాలని ఆయన ఇప్పటికే డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులు ముగ్గురి నలుగురి పేర్లతో సర్వేలు నిర్వహించనున్నారని తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ముఖ్యనేతలు, కార్యకర్తల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ కు అందించినట్లు తెలిసింది. అందుకే రానున్న ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులను మాత్రం పెద్ద సంఖ్యలోనే మారుస్తారన్న టాక్ గులాబీ పార్టీ నుంచి వినపడుతుంది.
కొత్తవారిని రంగంలోకి...
మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లోనూ కొత్త వ్యక్తిని రంగంలోకి దించే ఛాన్స్ ఉందంటున్నారు. బీఆర్ఎస్ కు చెందిన జోగినిపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ లు ఉన్నారు. వీరిలో సంతోష్ కుమార్ దగ్గరి బంధువు. ఆయనకు మరొకసారి అవకాశమిస్తే కుటుంబ పార్టీ అని మరొకసారి ముద్రపడే అవకాశముందని భావించి ఆయన పేరును పక్కన పెట్టారని తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర కూడా పారిశ్రామిక వేత్త కావడంతో ఆయనకు టిక్కెట్ ఇస్తే మరోసారి టిక్కెట్ అమ్ముకున్నారంటూ ప్రత్యర్థులు విమర్శలు చేసే అవకాశాలున్నాయి. అందుకే వీరిద్దరి పేర్లను మాత్రం కేసీఆర్ పరిశీలించడమే లేదని చెబుతున్నారు.
కొందరి పేర్లు పరిశీలనలో...
వీరు కాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి వంట ిపేర్లు వినిపిస్తున్నా ఎన్నికల సమయంలో ఆ సామాజికవర్గం నేతలకు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నది పార్టీ నుంచే వినపడుతున్న అభిప్రాయం. అందుకే ఈసారి కొత్త వారిని ఎంపిక చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఎస్.సి లేదా బీసీల నుంచి ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇందుకోసం నాలుగైదు పేర్లను గులాబీ బాస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ పేరు రివీల్ అయ్యే అవకాశముంది. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఒక్కదానికి గెలుచుకునే బలం బీఆర్ఎస్ ఉండటంతో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. మరి కేసీఆర్ చివరకు ఎవరి పేరును ఖరారు చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News