KCR : సారు కష్టం ఎవరికీ రాకూడదు... పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు తాను శాశ్వత ముఖ్యమంత్రినిని భావించారు. అదే ఆయన పార్టీని కొంపముంచింది

Update: 2024-02-15 06:30 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు తాను శాశ్వత ముఖ్యమంత్రినిని భావించారు. అదే ఆయన పార్టీని కొంపముంచింది. ఉద్యమాలంటేనే ఆయనకు పడేది కాదు. ఉద్యమకారులను దూరంగా పెట్టారు. ఆందోళనలు చేస్తే అణగదొక్కేంత వరకూ ప్రగతి భవన్ లో నిద్రపోరన్న నిజాన్ని అందరూ ఒప్పుకునేదే. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కావాలని అడగడం విడ్డూరంగా ఉందంటున్నారు. ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడంతో రాజకీయ నేతలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఓటమి తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలని, నడిరోడ్డు మీద నిలదీస్తానని చెప్పడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించేలా అనిపించింది.

ఉద్యమాలతోనే అంటూ...
ఉస్మానియా విద్యార్థులను యూనివర్సిటీ గడప దాటినీయంది ఎవరి హయాంలో? ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పడితే ఉక్కుపాదంతో అణిచి వేసింది ఎవరి పాలనలో? తర్వాత ఎన్నికలు వచ్చే సరికి వారిపై అనురాగం, ఆప్యాయతలు కురిపించింది కూడా అదే నేత. అయినా ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని కేసీఆర్ ఇప్పటికి గ్రహించారా? ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో ధర్నా చేయడానికి కూడా అనుమతులు ఇవ్వకపోవడాన్ని ఇప్పటికిప్పుడు మర్చిపోతారా? ధర్నా చౌక్ ను ఎత్తివేసిన ఘనత ఏ ప్రభుత్వానిది అన్న ప్రశ్నలు సహజంగానే ప్రజల నుంచి వస్తుండటం విశేషం. ఈ డైలాగ్ పై సోషల్ మీడియాలో కేసీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు...
డైలాగ్ వార్...
కేసీఆర్ తాను అనుకున్నది వర్క్ అవుట్ కాలేదు. తనను తప్ప తెలంగాణ ప్రజలు మరెవరిని నమ్మరని భావించారు. భ్రమించారు. అందులోనూ గ్రూపులతో నిత్యం కొట్లాడే కాంగ్రెస్ అస్సలు అధికారానికి దరిదాపుల్లోకి కూడా రాదని అంచనా వేశారు. కానీ రేవంత్ రెడ్డి రూపంలో ఆయనకు ముప్పు పొంచి ఉందని గ్రహించలేకపోయారు. మాటకు మాట.. డైలాగ్ కు డైలాగ్ తోనే కొట్టడంలో కేసీఆర్ ని మించిపోయారు రేవంత్ రెడ్డి. కౌంటర్ కు ప్రతి కౌంటర్ చేస్తున్నారు. నల్లగొండ సభలో పాలిచ్చే గేదెను పంపి.. దున్నపోతును తెచ్చుకున్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై రేవంత్ సెటైర్ వేశారు. కంచరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారంటూ కౌంటర్ వేశారు. ఇలా కేసీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా డైలాగుల్లో, చేతల్లో రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో...
దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు ఎక్కువ స్థానాలు సాధించడమెలా? అన్న బెంగ పట్టుకుంది. కాంగ్రెస్ కన్నా కనీసం రెండు, మూడు స్థానాలను సాధించగలిగితేనే పార్టీలో నేతలు నిలుస్తారు. లేకుంటే వరసబెట్టి తమ దారి తాము చూసుకుంటారు. నిత్యం తమకు అందుబాటులో ఉండే నేత వద్దకు రాజకీయ నాయకులు సహజంగానే పరుగులు తీస్తారు. దీంతో పార్లమెంటు ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రం అలక్ష్యం చూపకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రచారంలోనూ తాము కాంగ్రెస్ తో నెగ్గుకు రాలేమని, అందుకే సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్తవారికి అవకాశమిచ్చి ప్రయోగం చేయాలన్న భావనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద తమ బాస్ కు ఎంత కష్టమొచ్చిందన్న కామెంట్స్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News