రాంగ్ సెలక్షన్ కాదా?

ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇచ్చి పెద్ద టార్గెట్ విధించారు.

Update: 2023-10-01 05:49 GMT

మల్కాజ్ గిరి అతి పెద్ద శాసనసభ నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీలు గెలిచాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆకుల రాజేందర్ గెలిచారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిగా చింతల కనకారెడ్డి, 2018లో టీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావులు గెలిచారు. మరోసారి మైనంపల్లి హనుమంతరావు పోటీకి దిగుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇచ్చి పెద్ద టార్గెట్ విధించారు. రెండింటిలో గెలిచి రావాలని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రచారం ప్రారంభించినా...
బీఆర్ఎస్ తరుపున మైనంపల్లి హనుమంతరావుకు టిక్కెట్ ఖరారయినప్పటికీ తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వలేదన్న కారణంతో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుుకున్నారు. మైనంపల్లి ప్లేస్ లో వెంటనే కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. పేరు అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనకు నేరుగా గులాబీ బాస్ చెప్పడంతో వెంటనే మల్కాజ్ గిరిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తన అల్లుడి తరుపున ప్రచారాన్ని కూడా మంత్రి మల్లారెడ్డి మొదలు పెట్టారు. మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఆయన అల్లుడు మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆరోపణలతో...
అయితే మల్లారెడ్డి అల్లుడికి టిక్కెట్ కన్ఫర్మ్ చేయడం పెద్ద సాహసమేనంటున్నారు. మంత్రి మల్లారెడ్డికి పుష్కలంగా డబ్బు ఉందని భావించి టిక్కెట్ ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆయన పట్ల ప్రజల్లో అంత సానుకూల అభిప్రాయం లేదు. ఆయనపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం, కోట్లాది రూపాయల సొమ్మును ఐటీ శాఖ సీజ్ చేయడంతో పాటు పలు రకాల ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. విద్యాసంస్థల అధిపతిగా ఆయనను చూసేది స్వల్పమే. ఆయనను కోటీశ్వరుడిగానే చూస్తారు. దీంతో పాటు మల్లారెడ్డి కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం పట్ల కూడా పార్టీలోనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
బలమైన నేతలు...
అంతే కాకుండా మల్కాజ్ గిరి నియోజకవర్గం ఎప్పుడు ఎటు వైపు ఉంటుందో చెప్పలేం. అక్కడ బీజేపీ కూడా కొంత బలంగానే ఉంది. బీజేపీ అభ్యర్థిగా ఎన్.రామచంద్రరావు పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. అక్కడ ఆయన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఆయన పట్ల కొంత సానుకూలత కూడా ఉంది. 2014, 2018 ఎన్నికల్లో ఆయనే ద్వితీయ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు పోటీ చేస్తే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి గెలుపు అంత సులువు కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మల్కాజ్ గిరిలో గులాబీ బాస్ ది రాంగ్ సెలక్షన్ అన్న టాక్ వినపడుతుంది.
Tags:    

Similar News